Indian Army: ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి

జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లా మాచేడి ప్రాంతంలో ఇండియన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 08 Jul 2024 23:44 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఘోరం జరిగింది. కథువా (Kathua)జిల్లాలోని మాచేడి (Machedi) ప్రాంతంలో ఇండియన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాచేడి- కిండ్లీ- మల్హార్‌ రోడ్డు మార్గంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన జవాన్లను చికిత్స కోసం ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. 

ఉగ్రవాదులు పక్కా ప్లాన్‌ ప్రకారం దాడికి పాల్పడ్డారు. తొలుత కాన్వాయ్‌పై గ్రనేడ్‌ విసిరారు. వాహనం ఆగిపోవడంతో కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించేసరికి అక్కడి నుంచి దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అదనపు బలగాలు అక్కడికి చేరుకొని కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. 

గత 2 రోజుల్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఇది రెండోసారి. ఆదివారం రాజౌరీ వద్ద సైనిక శిబిరంపై ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో చీకట్లో పరారయ్యారు. వీరిని పట్టుకోవడానికి సైన్యం గాలింపు చేపట్టింది. మరోపక్క కుల్గామ్ జిల్లాలో రెండు రోజులుగా రెండు గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మృతి చెందారు. శనివారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్లలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని