దేశంలో 25కు చేరిన కరోనా కొత్తరకం కేసులు

దేశంలో కరోనా కొత్త రకం వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో ఐదుగురికి కొత్త స్ట్రెయిన్‌ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కొత్తరకం కేసుల సంఖ్య 25కు చేరింది. పుణెలోని నేషనల్‌

Updated : 31 Dec 2020 12:18 IST

దిల్లీ: దేశంలో కరోనా కొత్త రకం వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో ఐదుగురికి కొత్త స్ట్రెయిన్‌ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కొత్తరకం కేసుల సంఖ్య 25కు చేరింది. పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీలో నాలుగు, దిల్లీలోని ఐజీఐబీలో ఒక నమూనాలో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ గురువారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ 25 మందిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొంది. 

కొత్త రకం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వైరస్‌ వ్యాప్తి నివారణకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. స్ట్రెయిన్‌ పాజిటివ్‌ల తోటి ప్రయాణికులు, బంధువులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత రెండు వారాల్లో భారత్‌కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులపై కూడా కేంద్రం దృష్టిపెట్టింది. వీరిలో కరోనా సోకిన వారికి జీనోమ్‌ పరీక్షలు నిర్వహించనుంది. కొత్త స్ట్రెయిన్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌-యూకే మధ్య విమాన సర్వీసుల రద్దును మరో వారం పాటు పొడిగించింది. 

కొద్ది రోజుల్లోనే భారత్‌లో టీకా

మరోవైపు కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే సీరమ్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థలు తమ టీకాల అత్యవసర వినియోగం కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ బుధవారం సమావేశమైంది. మరింత లోతుగా చర్చించేందుకు శుక్రవారం మరోసారి భేటీ కానుంది. అయితే, మరి కొద్దిరోజుల్లోనే దేశంలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశముందని దిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్‌ గులేరియా విశ్వాసం వ్యక్తం చేశారు. ‘యూకేలో ఆస్ట్రాజెనెకా టీకాకు ఆమోదం లభించడం శుభవార్త. ఇదే టీకాను భారత్‌లో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. దీన్ని భద్రపరిచే విధానం, రవాణా సులువుగా ఉంది’అని రణదీప్‌ అన్నారు. ప్రస్తుతం టీకాలపై నిపుణుల కమిటీ తయారీ సంస్థల నుంచి అదనపు సమాచారం కోరిందని, దీన్ని పరిశీలించిన తర్వాత కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్లకు అనుమతులు మంజూరయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. 

ఇవీ చదవండి..

96శాతం దాటిన రికవరీ రేటు

దిల్లీలో నూతన సంవత్సర వేడుకలకు చెక్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని