Jignesh Mevani: అరెస్టుల మీద కాదు.. సమస్యల మీద దృష్టిపెట్టండి: జిగ్నేశ్‌ మేవానీ

బెయిల్‌పై విడుదలైన గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.......

Published : 01 May 2022 01:34 IST

గువాహటి: మహిళా పోలీసుపై దాడి కేసులో అరెస్టయి అస్సాం కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదలైన గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇతర రాష్ట్రాల శాసనసభ్యుల అరెస్టులపై కాకుండా.. రాష్ట్రంలోని సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు. ‘తప్పుడు ఆరోపణలు చేస్తూ గుజరాత్‌ లేదా ఇతర రాష్ట్రాల శాసనసభ్యులను లక్ష్యంగా చేసుకునే బదులు అస్సాంలోని విద్యుత్‌ కోతలు, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించండి. చిన్న, మధ్య తరగతి పరిశ్రమల పునరుద్ధరణ సహా రైతులు, కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి’ అంటూ కోక్రాఝర్‌లో విలేకర్లతో మేవానీ మాట్లాడారు.

తన అరెస్టుపై స్పందిస్తూ..‘ఇకపై ఏ ఎమ్మెల్యే లేదా సాధారణ పౌరుడి రాజ్యాంగ హక్కులు ఈ విధంగా కాలరాయకూడదని నేను కోరుతున్నా. నాకు మద్దతిచ్చిన అస్సాంలోని న్యాయవ్యవస్థతో పాటు రాష్ట్ర ప్రజలకు, అస్సాం కాంగ్రెస్ నాయకత్వానికి, మీడియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం స్వరాష్ట్రానికి వెళ్లేముందు, గువాహటిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేంద్రంపై మండిపడ్డారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకే అస్సాం ప్రభుత్వం తనను అరెస్టు చేసిందని ఆరోపించారు. ‘ఇదో కుట్ర. మత ఘర్షణల తర్వాత గుజరాత్‌లో శాంతి, సామరస్యాలు నెలకొల్పాలని మాత్రమే ప్రధానమంత్రికి ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశాను. ఒక మహిళా పోలీసు అధికారిని అడ్డుపెట్టుకొని నాపై రెండో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడం సిగ్గుచేటు. నా వ్యక్తిత్వాన్ని అణచివేయలేరని భాజపా, అస్సాం ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నా’ అని మేవానీ వెల్లడించారు. ఈ స్వతంత్ర ఎమ్మెల్యే శుక్రవారం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని