Anant Ambani: అంబానీల పెళ్లివిందులో.. అదరగొట్టనున్న కాశీ ఛాట్‌

ఆసియాలో అధిక సంపన్నుడు ముకేశ్‌ అంబానీ ఇంట వివాహమంటే.. పెళ్లిపత్రికల నుంచీ అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ ప్రత్యేకమే.

Updated : 10 Jul 2024 09:08 IST

ఈటీవీ భారత్‌: ఆసియాలో అధిక సంపన్నుడు ముకేశ్‌ అంబానీ ఇంట వివాహమంటే.. పెళ్లిపత్రికల నుంచీ అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ ప్రత్యేకమే. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ - రాధిక మర్చెంట్‌ల నిశ్చితార్థం మొదలు ప్రీ వెడ్డింగ్‌ వేడుకల వరకు ప్రతి కార్యక్రమం కనీవినీ ఎరుగని రీతిలో జరిగాయి. మార్చి నెలలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమంలో అతిథులకు దాదాపు 2,500 రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారు. అప్పుడే ఇన్ని రకాల వంటకాలతో భోజనాలు పెడితే.. జులై 12న ఇచ్చే పెళ్లివిందుకు ఇంకెన్ని రకాలు వండుతారో! ఈ మెనూ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినా.. అందులో కొన్నింటి వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ ఛాట్‌భండార్‌ వ్యాపారులు ఈ పెళ్లివిందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెనూలో కుల్ఫీ, ఫాలూదా, టిక్కీ, టమాటా ఛాట్, పాలక్‌ ఛాట్, చనా కచోరీ, దహీ పూరి, బనారస్‌ ఛాట్‌ లాంటి స్పెషల్స్‌ను అతిథుల కోసం సిద్ధం చేయనున్నారు. వీటిని ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కాశీ ఛాట్‌భండార్‌ యజమాని కేసరి ఓ జాతీయ మీడియాకు తెలిపారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు రోజులపాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి. జులై 12న శుభ్‌ వివాహ్‌తో మొదలై.. 13న శుభ్‌ ఆశీర్వాద్, 14న మంగళ్‌ ఉత్సవ్‌తో ముగుస్తాయి.   

హల్దీ వేడుకలో మెరిసిన రాధిక.. 

సోమవారం రాత్రి జరిగిన హల్దీ వేడుకలో వధువు రాధిక ధరించిన పసుపురంగు లెహంగాపై పూల దుపట్టా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రియా కపూర్, అనామికా ఖన్నా ఈ దుపట్టాను డిజైన్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని