Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌ దిగ్గజం ‘క్రిస్టియానో రొనాల్డో’కు గోవాలో విగ్రహం

పోర్చుగీసుకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ జాంబవాన్‌ క్రిస్టియానో రొనాల్డో విగ్రహాన్ని గోవా రాజధాని పనాజీలోని కలంగుటిలో రాష్ట్ర మంత్రి మైఖెల్‌ లోబో ఆవిష్కరించారు...

Published : 29 Dec 2021 23:48 IST

పనాజీ: పోర్చుగీసుకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో విగ్రహాన్ని గోవా రాజధాని పనాజీలో రాష్ట్ర మంత్రి మైఖెల్‌ లోబో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..యువతను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఫుట్‌బాల్ ఆటను మరో స్థాయికి తీసుకెళ్లే ఉద్ధేశంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విగ్రహం బరువు దాదాపు 410 కిలోలని, యువతరాన్ని క్రీడలవైపు ప్రోత్సహించడం, వారి కలలు లక్ష్యం చేసుకునేలా చేయడమే విగ్రహ ఏర్పాటు లక్ష్యమన్నారు. భారత్‌లో క్రిస్టియానా రొనాల్డో విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం అని, ఇది మన యువతతో స్ఫూర్తి నింపడం కోసం తప్ప మరొకటి కాదన్నారు. మంచి ఫుట్‌బాల్‌ మైదానాలను, మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత మున్సిపాలిటీలు, పంచాయతీలదని మంత్రి పేర్కొన్నారు. ఫుట్‌బాల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడానికి యువతీ యువకులు నడుం బిగించాలని కోరారు.విగ్రహ స్థాపనను కొందరు వ్యతిరేకిస్తున్నారని క్రీడల్లో దేశం పురోగమించడం వారికి ఇష్టం లేదన్నారు. విగ్రహం ఎదుట సెల్ఫీలు దిగి యువత స్ఫూర్తి పొందాలని కోరుతూ మంత్రి మైఖెల్‌ లోబో ట్వీట్‌ చేశారు. పనాజీలో కొత్త పర్యాటక ప్రాంతంగా మారిన రొనాల్డో విగ్రహం ఎదుట నిలుచుని ఫుట్‌బాల్‌ క్రీడాకారులు, పర్యాటకులు ఫొటోలు దిగుతున్నారు. పోర్చుగల్‌ దేశానికి చెందిన 36ఏళ్ల రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీల్లో 115 గోల్స్‌ సాధించి అధిక గోల్స్‌ సాధించిన వారి జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని