MCD Polls: దిల్లీ మేయర్‌ ఎన్నిక.. సుప్రీం తలుపు తట్టిన ఆప్‌

దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నిక వ్యవహారంపై ఆప్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మేయర్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 26 Jan 2023 23:59 IST

దిల్లీ: దిల్లీ మేయర్‌ ఎన్నిక వ్యవహారం (MCD polls) ఓ కొలిక్కి రావడం లేదు. వివాదాల నేపథ్యంలో ఇప్పటికే  రెండు సార్లు వాయిదా పడిన ఎన్నికపై.. ఆప్‌ మేయర్‌ (APP Mayor) అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ (Shelly Oberoi) తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అధికార భాజపా ఉద్దేశ పూర్వకంగానే మేయర్‌ ఎన్నికను తాత్సారం చేస్తోందని నిర్ణీత గడువులోగా మేయర్‌ ఎన్నికను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపే అవకాశముంది. అంతేకాకుండా చట్టం ప్రకారం 10 మంది నామినేటెడ్‌ కౌన్సిలర్‌ సభ్యులకు మేయర్‌ ఎన్నిక సమయంలో ఓటుహక్కు కల్పించకూడదని ఆప్‌ వాదిస్తోంది.

మంగళవారం జరిగిన మేయర్‌ ఎన్నిక సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ మొదట 10మంది నామినేటెడ్ కౌన్సిలర్స్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే మేయర్ ఎన్నికలో వారు ఓటువేయడానికి అనుమతి లేదంటూ ఆప్‌ వ్యతిరేకించింది. క్రితంసారి వారి ప్రమాణ స్వీకారం విషయంలోనే ఆప్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. మేయర్ ఎన్నికను భాజపాకు అనుకూలంగా మార్చేందుకు, ఉద్దేశపూర్వకంగానే వారిని నామినేట్‌ చేశారని విమర్శించింది. డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను దాటి.. 134 స్థానాలను కైవసం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని