Mulayam: ములాయం కోసం ప్రత్యేక పూజలు.. అవసరమైతే కిడ్నీ ఇస్తానంటూ ఓ నేత ప్రకటన!

తీవ్ర అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ కోసం ఆ పార్టీ శ్రేణులు ఉత్తర్‌ప్రదేశ్‌ వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాయి......

Published : 04 Oct 2022 01:12 IST

లఖ్‌నవూ: తీవ్ర అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ కోసం ఆ పార్టీ శ్రేణులు ఉత్తర్‌ప్రదేశ్‌ వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాయి. క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సీసీయూ)లో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా లఖ్‌నవూలోని విక్రమాదిత్య మార్గ్‌లోని ములాయం నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న హనుమాన్‌ ఆలయంలో పార్టీ కార్యకర్తలు పూజలు చేశారు. అలాగే, వారణాసిలోని గిలాత్‌ బజార్‌లోని హనుమాన్‌ ఆలయం, లొహతియాలోని బడా గణేశ్‌ మందిరంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధికారప్రతినిధి మనోజ్‌ రాయ్‌ మాట్లాడుతూ.. తామంతా ముద్దుగా పిలుచుకొనే ‘నేతాజీ’ ఆశీర్వాదం పార్టీలోని ప్రతిఒక్కరికీ అవసరమని.. వారణాసిలోని  పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అజయ్‌ యాదవ్‌ ములాయం కోసం అవసరమైతే తన కిడ్నీ ఇచ్చేందుకు కూడా సిద్దమేనని ప్రకటించారు. అటు, షహ్రాన్‌పూర్‌లోనూ ములాయం సింగ్‌ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేశారు. నగర పార్టీ మాజీ అధ్యక్షుడు ఫైసల్‌ అస్మానీ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 

ఆస్పత్రికి ఎవరూ రావొద్దు.. ఎస్పీ విజ్ఞప్తి

మరోవైపు, గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ములాయంను చూసేందుకు ప్రజలు వస్తుండటంతో సమాజ్‌వాదీ పార్టీ కీలక విజ్ఞప్తి చేసింది. ఆస్పత్రి వద్దకు ఎవరూ రావొద్దని కోరింది. ప్రస్తుతం ఆయనకు క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స కొనసాగుతోందని, ‘నేతాజీ’ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు పేర్కొంది. ఆస్పత్రికి వెళ్లినా ఆయన్ను కలవడం సాధ్యం కాదని.. అక్కడికి ఎవరూ వెళ్లొద్దని కోరింది. అలాగే, ములాయం ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తామని శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు