Indiaలో విదేశీ విద్యార్థుల సంఖ్య ఎంతంటే..?

భారత్‌లో విదేశీ విద్యార్థుల సంఖ్య 2019-20లో స్వల్పంగా పెరిగింది.

Published : 11 Jun 2021 01:51 IST

దిల్లీ: భారత్‌లో విదేశీ విద్యార్థుల సంఖ్య 2019-20లో స్వల్పంగా పెరిగింది. దాంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 50వేలకు చేరువైందని గురువారం కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. వారిలో అగ్రదేశం అమెరికాకు చెందిన విద్యార్థులు సుమారు 1,600మంది ఉండగా..ఆసియా దేశాలకు చెందిన విద్యార్థుల వాటా అధికంగా ఉందని తెలిపింది.   

2018-19లో భారత్‌లో విద్యనభ్యసిస్తోన్న విదేశీ విద్యార్థుల సంఖ్య 47,427 మంది కాగా, 2019-20లో అది 49,348కి చేరింది. ఈ సంఖ్యలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ..విదేశీ విద్యార్థులకు భారత్ గమ్యస్థానం కావాలనే లక్ష్యం మాత్రం చాలా దూరంలో ఉందని నిపుణులు అంటున్నారు. మరోవైపు, కేంద్రం 2,00,000మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రస్తుత సంఖ్య కంటే నాలుగు రెట్లు అధికం కావడం గమనార్హం. ఇక, ఇదే సంవత్సరంలో అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య 1,93,124గా ఉంది. 

వార్షిక ఉన్నత విద్యా సర్వే ఆధారంగా విద్యాశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..ప్రస్తుతం మనదేశంలో 168 దేశాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విషయంలో పొరుగు దేశాల వాటానే ఎక్కువగా ఉంది. నేపాల్ (28.1శాతం), ఆఫ్ఘనిస్థాన్‌(9.1శాతం), బంగ్లాదేశ్‌(4.6శాతం), భూటాన్‌(3.8శాతం) ఈ జాబితాలో ముందువరసలో ఉన్నాయి. సుడాన్, అమెరికా, నైజీరియా, యెమెన్‌, మలేషియా, యూఏఈ దేశాలు మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. యూఎస్‌, మలేషియా మినహా ఈ పది దేశాల నుంచి విద్యార్థినుల సంఖ్య కంటే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉందని తెలిపింది. కర్ణాటక(10,231) ఎక్కువమంది విద్యార్థులను ఆకర్షిస్తుండగా..ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని