Foreign Tourists: ఇక విదేశీ పర్యాటకులు భారత్‌కు రావొచ్చు!

విదేశీ పర్యాటకులకు విధించిన కొవిడ్‌ నిబంధనలు ఎత్తివేసి వారికి పర్యాటక వీసాలను మంజూరు చేయాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది

Published : 07 Oct 2021 20:46 IST

దిల్లీ: విదేశీ పర్యాటకులకు విధించిన కొవిడ్‌ నిబంధనలు ఎత్తివేసి వారికి పర్యాటక వీసాలను మంజూరు చేయాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భారత్‌ను సందర్శించాలనుకునే విదేశీయులకు నవంబర్ 15 నుంచి తాజాగా పర్యాటక వీసాలను మంజూరు చేస్తామని పేర్కొంది. అయితే, ఛార్టర్డ్ విమానాల్లో వచ్చే వారికి అక్టోబర్ 15 నుంచే వీసాల మంజూరు ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

‘‘కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తితో విదేశాల నుంచి వచ్చే  పర్యాటకులకు గతేడాది మంజూరు చేసిన వీసాలను నిలిపివేశాం. అంతర్జాతీయ ప్రయాణాలతో కొవిడ్‌ మరింత విజృంభిస్తుందనే ఉద్దేశంతో ప్రయాణ ఆంక్షలు విధించాం. ప్రస్తుతం కొవిడ్‌ కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విదేశీయులు ఇండియాకు రావడానికి పర్యాటక వీసాలనే కాకుండా ఇతర భారతీయ వీసాలను మంజూరు చేస్తాం’’ అని ప్రకటనలో పేర్కొంది. కాగా.. దీనిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే ప్రయాణ ఆంక్షలను సడలించాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలను విదేశీ పర్యాటకులు తప్పక పాటించేలా మార్గదర్శకాలు ఉండాలని రాష్ట్రాలు కోరాయని ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని