విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!

విదేశీయులకు భారత పౌరసత్వం పొందే వీలున్న ఓసీఐ(ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా) హోదాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి

Published : 10 Apr 2021 01:14 IST

మరోసారి స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: విదేశీయులకు భారత పౌరసత్వం పొందే వీలున్న ఓసీఐ(ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా) హోదాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఓసీఐ పొందిన విదేశీయులు.. విడాకులు తీసుకున్న తరుణంలో ఆ హోదా రద్దు అవుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

భారతీయ పౌరుడిని పెళ్లాడిన ఒక బెల్జియం మహిళ కొంతకాలం క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది. దీంతో ఓసీఐ కార్డును తిరిగి ఇచ్చేయాలని బెల్జియంలోని భారత రాయబార కార్యాలయం ఆమెను కోరింది. ఇందుకు ఆ మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత పౌరసత్వ చట్టం - సెక్షన్‌ 7డి (ఎఫ్)  ప్రకారం, భారత పౌరులను వివాహమాడిన విదేశీయులు, విడాకుల తర్వాత ఓసీఐ హోదాను కోల్పోతారు. లేదా అర్హతలేని విదేశీయుల ఓసీఐ కార్డు రిజిస్ట్రేషన్ రద్దవుతుంది. ఈ నిబంధనను సవాలు చేస్తూ బెల్జియం మహిళ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఓసీఐ కార్డు ఉన్నవారు విడాకులు పొందితే ఆ హోదా రద్దు అవుతుందని చట్టంలో స్పష్టంగా ఉందని.. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ తాజాగా దిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

భారత పౌరుడిని పెళ్లి చేసుకున్నందున బెల్జియంలోని భారత రాయబార కార్యాలయం ఆ మహిళకు 2006 అగస్టు 21న పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ కార్డు (పీఐఓ)ను జారీ చేసింది. అనంతరం 2011 అక్టోబరులో ఆ మహిళ అతని నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకుంది. విడాకుల తర్వత ఆమెకు జారీ చేసిన పీఐఓ కార్డు రద్దు కావాల్సి ఉన్నప్పటికీ..ఆ సమయంలో అది రద్దు కాలేదు. అయితే, 2017లో ఆమెకు అనుకోకుండా ఓసీఐ కార్డు జారీ అయినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటికీ ఆమెకు జారీ చేసిన ఓసీఐ కార్డు రద్దు కాలేదనీ, దాన్ని తిరిగి అప్పజెప్పాలని లేదంటే చట్ట ప్రకారం కార్డు రద్దు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి విదేశీయులు భారత్‌లో ఉండేందుకు ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం వీసాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని