NTA: ఎన్‌టీఏ ప్రక్షాళనకు ఇస్రో మాజీ ఛైర్మన్‌ అధ్యక్షతన కమిటీ

ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Published : 23 Jun 2024 04:55 IST

సభ్యుల్లో హెచ్‌సీయూ వీసీ బీజే రావుకు చోటు
నివేదిక సమర్పణకు 2 నెలల గడువు 

ఈనాడు, దిల్లీ: ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవల నిర్వహించిన నెట్, నీట్‌ ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో ఎన్‌టీఏను సంస్కరించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కమిటీ సభ్యులను నియమిస్తూ శనివారం కేంద్ర విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వనుందని పేర్కొంది. పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను మెరుగుపరచడం, ఎన్‌టీఏ నిర్మాణం, పని విధానంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పుల గురించి సిఫార్సు చేస్తూ ఈ ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించనుంది.

కమిటీ ఇదే..

ఛైర్మన్‌: కె.రాధాకృష్ణన్‌ (ఇస్రో మాజీ ఛైర్మన్‌)

సభ్యులు

 • రణదీప్‌ గులేరియా (దిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌)
 • బీజే రావు (హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌)
 • కె.రామమూర్తి (మద్రాస్‌ ఐఐటీ గౌరవ    ప్రొఫెసర్‌)
 • పంకజ్‌ బన్సల్‌ (పీపుల్‌ స్ట్రాంగ్‌ సహ వ్యవస్థాపకుడు, కర్మయోగి భారత్‌ బోర్డు సభ్యుడు)
 • ఆదిత్య మిత్తల్‌ (దిల్లీ ఐఐటీ డీన్‌)
 • గోవింద్‌ జైశ్వాల్‌ (కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి)

కమిటీకి విధివిధానాలు..

1. పరీక్ష నిర్వహణ యంత్రాంగంలో సంస్కరణలు

 • ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకూ మొత్తం ప్రక్రియను పరీక్షించి అందులో ఎక్కడెక్కడి పరిస్థితులను మెరుగుపరచాలి. పేపర్‌ లీకవడానికి అవకాశం ఉన్న మార్గాలను ఎలా అడ్డుకోవాలి?
 • ఎన్‌టీఏలో ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రామాణిక నిర్వహణ విధానాలను (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌) సంపూర్ణంగా సమీక్షించి వాటి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రతి దశలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకునే పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఎలా ఏర్పాటు చేయాలి?

2. డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను మెరుగుపరచడం

 • ప్రస్తుతం అమల్లో ఉన్న భద్రత చర్యలు, ఎన్‌టీఏ అనుసరిస్తున్న ప్రొటోకాల్స్‌ను మదింపు చేసి వాటి స్థానంలో మెరుగైన వ్యవస్థను సిఫార్సు చేయడం.
 • పేపర్‌ సెట్టింగ్‌కు ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రొటోకాల్స్‌ను పరీక్షించి, మరింత బలమైన వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి సూచనలు.

3. ఎన్‌టీఏ నిర్మాణం, పని విధానం

 • ఎన్‌టీఏ మరింత సమర్థవంతంగా పని చేయడానికి దాని నిర్మాణం, పని విధానంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు. ప్రతి దశలోని అధికారులకు వారి పాత్ర, బాధ్యతలను ఎలా నిర్దేశించాలి? 
 • ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం స్థితిగతులను అంచనా వేసి, దాని పని తీరును మెరుగుపరచడానికి సిఫార్సులు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు