Yediyurappa: బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప

Yediyurappa: పోక్సో కేసులో విచారణ నిమిత్తం కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సోమవారం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.

Updated : 17 Jun 2024 12:55 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప (BS Yediyurappa).. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం తాజాగా ఆయన సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. సోమవారం ఉదయం బెంగళూరులోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న యడియూరప్పను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

పోక్సో కేసు (POCSO case)లో ఆయనను అరెస్టు చేయవద్దని ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.  ఈ కేసు విచారణకు హాజరయ్యే సమయంలోనూ ముందస్తు నోటీసు లేకుండా ఆయనను అదుపులోకి తీసుకోవద్దని స్పష్టంచేసింది. అదే సమయంలో.. విచారణకు గైర్హాజరుకాకూడదని యడియూరప్పకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే నేడు ఆయన సీఐడీ (CID) ఎదుట హాజరయ్యారు.

ఉద్యోగులు ఆలస్యంగా వస్తే కఠినచర్యలు: కేంద్రం

17 ఏళ్ల బాలికపై యడియూరప్ప (EX CM Yediyurappa) లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె   తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను భాజపా నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది.

ఈ కేసుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు చేసిన బాధితురాలి తల్లి ఇటీవల ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకంటే ముందే బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ రికార్డ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన తర్వాత యడియూరప్ప వాయిస్‌ శాంపిళ్లను కూడా అధికారులు సేకరించారు. కాగా.. ఈ ఆరోపణలను మాజీ సీఎం ఖండించారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని