Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు డెంగీ నిర్ధారణ

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌కు డెంగీ సోకినట్టు నిర్ధారణ అయిందని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్లేట్‌లెట్స్‌ సంఖ్య క్రమంగా........

Published : 16 Oct 2021 20:20 IST

దిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌కు డెంగీ సోకినట్టు నిర్ధారణ అయిందని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్లేట్‌లెట్స్‌ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వివరించారు. 89ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌కు సోమవారం జ్వరం రావడం.. దాన్నుంచి కోలుకున్నాక కూడా నీరసం తగ్గకపోవడంతో బుధవారం సాయంత్రం దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో సెంటర్‌ ప్రైవేటు వార్డులో చికిత్స పొందుతున్నారు. డాక్టర్‌ నితీశ్‌ నాయక్‌ నేతృత్వంలోని కార్డియాలజిస్టుల బృందం చికిత్స అందిస్తోంది. 

కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తీరుపై వివాదం!

గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆస్పత్రికి వెళ్లి మన్మోహన్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే, పరామర్శకు వెళ్లిన సందర్భంలో తన వెంట ఫొటోగ్రాఫర్‌ని తీసుకెళ్లారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి. దీనిపై మన్మోహన్‌సింగ్‌ కుమార్తె దమన్‌సింగ్‌ మండిపడ్డారు. గదిలోకి వెళ్లినప్పుడు కేంద్రమంత్రి వెంట ఫొటోగ్రాఫర్‌ వెళ్లడం తన తల్లికి నచ్చలేదన్నారు. ఎంతో కలతకు గురైన ఆమె ఆ ఫొటోగ్రాఫర్‌ని బయటకు వెళ్లమని చెప్పారని దమన్‌సింగ్‌ తెలిపారు. తన తల్లిదండ్రులు ఈ క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆమె.. ఇద్దరూ పెద్దవాళ్లనీ  జూలో జంతువులు కాదు అంటూ స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని