Raghuram Rajan: రాహుల్ ‘జోడో యాత్ర’లో రఘురామ్‌ రాజన్‌

‘భారత్‌ జోడో యాత్ర’లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌(Raghuram Rajan) పాల్గొని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)తో కొంతసేపు కలిసి నడిచారు. గతంలో కాంగ్రెస్‌ (Congress)కు చెందిన ఓ సదస్సులో రాజన్‌ పాల్గొని.. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించిన విషయం తెలిసిందే.

Published : 14 Dec 2022 10:09 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)’లో కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులూ పాల్గొంటున్నారు. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (Raghuram Rajan) కూడా జోడో యాత్రలో పాల్గొని రాహుల్‌తో కలిసి నడిచారు. బుధవారం ఉదయం రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌ నుంచి రాహుల్‌ ‘జోడో యాత్ర’ ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొన్న రాజన్.. నడుస్తూనే రాహుల్‌తో పలు అంశాలను చర్చించారు.

గతంలో నోట్ల రద్దును వ్యతిరేకించడంలో కాంగ్రెస్‌ (Congress)కు రఘురామ్‌ రాజన్‌ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. రాజన్‌ (Raghuram Rajan) కూడా పలుమార్లు ఈ నోట్ల రద్దుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. ఇక, భారత ఆర్థిక వృద్ధి, ద్రవ్యలోటుపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కాంగ్రెస్‌కు చెందిన ఓ సదస్సులోనూ పాల్గొన్న ఆయన.. రాజకీయ నాయకులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చుకోవాలనుకుంటే శ్రీలంక తరహా పరిస్థితులు తలెత్తుతాయని వ్యాఖ్యనించారు.

ఇక, సెప్టెంబరు 7న కన్యాకుమారిలో మొదలైన ‘భారత్‌ జోడో యాత్ర’ ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి కశ్మీర్‌ చేరుకోనుంది. పలు రాష్ట్రాలను దాటుకుంటూ కొనసాగుతోన్న ఈ యాత్రలో పలువురు సినిమా సెలబ్రిటీలు, ప్రభుత్వ మాజీ అధికారులు, సామాజిక, హక్కుల కార్యకర్తలు పాల్గొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు