
south africa: మండేలా విడుదలకు పాటుపడిన‘క్లెర్క్’ కన్నుమూత
డర్బన్: దక్షిణాఫ్రికాకు చివరి శ్వేతజాతి అధ్యక్షుడిగా పనిచేసిన ఎఫ్‌డబ్ల్యూ డి క్లెర్క్ (85) తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో పోరాడుతూ గురువారం కేప్‌టౌన్ ఫ్రెస్నేలోని తన నివాసంలో మాజీ అధ్యక్షుడు మరణించినట్లు క్లెర్క్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. 1990 ఫిబ్రవరి 2న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సహా ఇతర ఉద్యమ సంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తూ క్లెర్క్ చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. 27 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న నెల్సన్ మండేలాను విడుదల చేయాలనే ఆదేశాలనూ ఆయన అదే వేదికపై నుంచి జారీచేయడం విశేషం. నాలుగేళ్ల అనంతరం జరిగిన మొట్టమొదటి ప్రజాస్వామ్య ఎన్నికల్లో మండేలా దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వర్ణవివక్షను రూపుమాపేందుకు స్థాపించిన జాతీయ పార్టీ సభ్యుడిగా దక్షిణాఫ్రికా పార్లమెంటుకు క్లెర్క్ ఎన్నికయ్యారు. పలు ఉన్నత పదవులను అధిరోహించారు. 1994లో మండేలాకు పాలనా పగ్గాలు అప్పగించే వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సేవలందించారు. శ్వేతజాతీయుల నుంచి దేశ పాలనను నల్ల జాతీయులకు అందించే క్రమంలో అందించిన అద్భుత సేవలకు గాను నెల్సన్ మండేలాతో కలిసి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.