Air Suvidha: ఆర్టీ-పీసీఆర్‌, వ్యాక్సినేషన్‌ ప్రూఫ్‌.. విదేశీ ప్రయాణికులకు మళ్లీ ఆ రూల్స్‌..?

కొవిడ్‌ సమయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొన్ని నిబంధనలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎయిర్‌ సువిధ పేరుతో ప్రవేశపెట్టిన ఆ నిబంధనలను మరోసారి తప్పనిసరి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Published : 22 Dec 2022 18:17 IST

దిల్లీ: పలు దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోన్న వేళ.. కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైరస్‌ వ్యాప్తిపై ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నామని చెప్పిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైనాతోపాటు కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులకు గతంలో విధించిన ‘ఎయిర్‌ సువిధ (Air Suvidha)’  నిబంధనలను మళ్లీ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రయాణానికి 72 గంటలకు ముందు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష (RT-PCR Test) లేదా వ్యాక్సిన్‌ (Vaccination) వివరాలు పొందుపరిచే స్వీయ ధ్రువీకరణను విదేశీ ప్రయాణికులకు తప్పనిసరి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పరిస్థితులను కొన్ని రోజులపాటు పరిశీలించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇతర దేశాల్లో కొవిడ్‌ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో విదేశీ ప్రయాణికులకు ఎటువంటి నిబంధనలు వర్తింపజేయాలనే విషయాన్ని చర్చించారు. ఎయిర్‌పోర్టుల్లో ర్యాండమ్‌ పద్ధతిలో కొవిడ్‌ టెస్టులు చేయడం వంటి అంశంపైనా నిపుణులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం కొవిడ్‌ శాంపిళ్లను ఇన్సాకాగ్‌ (INSACOG) ల్యాబ్‌లకు పంపించాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. వీటితోపాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ అమలు చేసే విషయాన్ని ప్రస్తావించినట్లు ఆరోగ్యశాఖ నిపుణులు పేర్కొన్నారు.

ఏమిటీ ఎయిర్‌ సువిధ..?

‘ఎయిర్‌ సువిధ’ అనేది విదేశీ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు.. వారి వ్యక్తిగత వివరాలతోపాటు ఏ వ్యాక్సిన్‌, ఎన్ని డోసులు, ఎప్పుడెప్పుడు వేయించుకున్నారన్న విషయాలను ఇందులో కచ్చితంగా నింపాలి. అంతేకాకుండా ఆర్టీపీసీఆర్‌ టెస్టు (RT-PCR Test) వివరాలను అందులో పొందుపరచాలి. అయితే, దేశంలో కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం నేపథ్యంలో ఇటీవలే ఈ నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.

ఇదిలాఉంటే, ప్రపంచ వ్యాప్తంగా గత ఆరు వారాలుగా కొవిడ్‌ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. నిత్యం సరాసరి 5.9లక్షల కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో మాత్రం గడిచిన 24 రోజుల్లో 185 కేసులు నమోదు కాగా.. క్రియాశీల కేసుల సంఖ్య 3402లకు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని