Amit Shah: దేశ చరిత్రలో.. ఆ ‘నలుగురు గుజరాతీ’ల సేవలు అమోఘం

దేశ చరిత్రలో మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌, మొరార్జీ దేశాయ్‌లతోపాటు నరేంద్ర మోదీ (Narendra Modi)ల కృషి ఎంతో ఉందని కేంద్ర మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. 

Updated : 19 May 2023 20:10 IST

దిల్లీ: ఆధునిక భారత చరిత్రలో నలుగురు గుజరాతీలు (Gujaratis) దేశానికి ఎంతో సేవచేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌, మొరార్జీ దేశాయ్‌లతోపాటు నరేంద్ర మోదీ (Narendra Modi).. దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. దిల్లీ గుజరాతీ సమాజ్‌ 125 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన అమిత్‌ షా.. ప్రధాని మోదీ వల్లే భారత కీర్తి ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తోందన్నారు.

‘మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌, మొరార్జీ దేశాయ్‌, నరేంద్ర మోదీ.. ఈ నలుగురు గుజరాతీలు దేశానికి ఎంతో సేవ చేశారు. గాంధీజీ కృషితో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. సర్దార్‌ పటేల్‌ చొరవతో దేశం ఏకమైంది. మొరార్జీ దేశాయ్‌ వల్ల ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. నరేంద్ర మోదీతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ కీర్తి పెరుగుతోంది’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన ఈ నలుగురు నాయకులు ఎన్నో గొప్ప పనులు చేశారని.. దేశానికి వారెంతో గర్వకారణమన్నారు.

ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం ఎన్నో ఘనతలు సాధించిందని అమిత్‌ షా తెలిపారు. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు అయిదో స్థానానికి చేరుకుందన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి అంతర్జాతీయ సంస్థలూ భారత ఆర్థిక వ్యవస్థను ఆశారేఖగా చూస్తున్నాయన్నారు. తమ సరిహద్దులను ఎవ్వరూ మార్చలేరంటూ సర్జికల్, ఎయిర్‌ స్ట్రైక్‌లతో.. ప్రపంచ దేశాలకు భారత్‌ గట్టి సందేశాన్ని ఇచ్చిందన్నారు. మోదీ నాయకత్వంలో మొబైల్‌ ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగిన భారత్.. స్టార్టప్‌లు, పునరుత్పాదక శక్తి ఇంధనం తయారీలో దూసుకెళ్తోందని ఉద్ఘాటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని