Kashmir: ఆత్మాహుతి దాడి కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు..!

కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌ కమాండర్‌ను మట్టుబెట్టాయి

Published : 02 Nov 2022 11:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్ము కశ్మీర్‌లో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా జరిపిన వేర్వేరు దాడుల్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అవంతిపొరలో ఆత్మాహుతి ఉగ్రదాడిని ముందుగానే గుర్తించి అడ్డుకొన్నారు. ఈ మొత్తం ఆపరేషన్లు అనంతనాగ్‌, పుల్వామా జిల్లాల్లో చోటు చేసుకొన్నాయి. అవంతిపొరలోని భద్రతా దళాల క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి చేసేందుకు లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కమాండర్‌ ముక్తార్‌ భట్‌ ఓ విదేశీ  ఉగ్రవాది, మరో స్థానిక ఉగ్రవాదితో కలిసి సిద్ధమయ్యాడు. భద్రతా దళాలు ముందస్తుగా దాడి చేసి ఈ కుట్రను భగ్నం చేశాయి. ఈ సందర్భంగా జరిగిన ఆపరేషన్‌లో భట్‌ సహా ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ విషయాన్ని రాష్ట్ర అడిషనల్‌ డీజీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఏకే-56, పిస్తోల్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ముక్తార్‌ భట్‌ గతంలో ఓ సీఆర్‌పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది హత్యలో నిందితుడు. ఇతడిపై పలు నేరాభియోగాలు ఉన్నాయి. భద్రతా దళాలకు కశ్మీర్‌లో ఇది పెద్ద విజయం.

అనంతనాగ్‌లోని బిజ్‌బెహ్రా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో షకీర్‌ అహ్మద్‌ అనే ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్‌ చేశారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రసంస్థకు చెందిన ఇతడు గతంలో పలు నేరాల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనగర్‌లో మరో ఘటనలో ఓ ఉగ్రవాదిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 10 కిలోల ఐఈడీని, రెండు హ్యాండ్‌ గ్రనేడ్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఐఈడీని భద్రతా దళాలు ధ్వంసం చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని