Coronavirus: బిహార్‌లో నలుగురు విదేశీయులకు కరోనా..!

చైనాలో కరోనా విజృంభిస్తోంది. పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వారిలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. 

Updated : 26 Dec 2022 12:24 IST

పట్నా: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్(Covid-19)భయాలు చుట్టుముట్టిన వేళ.. మరోవార్త కలవరం పుట్టిస్తోంది. బిహార్‌(Bihar)లో నలుగురు విదేశీయులకు కరోనా సోకినట్లు తేలింది. గయ(Bodh Gaya) విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా తేలింది. దాంతో ఉలిక్కిపడిన వైద్య శాఖ వెంటనే అప్రమత్తమైంది. 

బౌద్ధ గురువు దలైలామా నెల రోజుల పాటు బోధ్‌గయలో ఉండనుండటంతో.. ఆయన్ను కలిసేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆ ప్రాంతానికి రానున్నారు. ఈ క్రమంలో వైద్య వర్గాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. గయ ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ వంటి పలు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో ఆదివారం జలుబు, దగ్గుతో బాధపడుతోన్న 33 మందిని పరీక్షించగా.. నలుగురికి పాజిటివ్‌గా తేలింది. వారు ఇంగ్లాండ్‌, మయన్మార్ వాసులని ప్రాథమిక సమాచారం. అందులో ముగ్గురిని గయలో ఐసోలేషన్‌లో ఉంచారు. మరో వ్యక్తి దిల్లీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దాంతో వైద్య వర్గాలు అప్రమత్తమయ్యాయి.  

చైనా నుంచి బెంగళూరు వచ్చిన వ్యక్తికి కరోనా..

నిన్న చైనా నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రాయానికి చేరుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, ఐసోలేషన్‌లో ఉంచినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ కొవిడ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. 

ఒకపక్క చైనాలో కరోనా విలయం సృష్టిస్తుండగా.. బ్రెజిల్, అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజరీ జారీ చేసింది. అలాగే ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.. ఇండియన్ మెడికల్‌ అసోసియేషన్‌కు చెందిన ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని