Mohan Majhi: ఒడిశా నూతన సీఎంగా మోహన్‌ మాఝి ప్రమాణం

ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ్‌ మాఝి (Mohan Majhi) ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 12 Jun 2024 18:24 IST

భువనేశ్వర్‌: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ మాఝి (Mohan Majhi) ప్రమాణస్వీకారం చేశారు. దీంతో రాష్ట్రంలో భాజపా తరఫున తొలి సీఎంగా రికార్డు సృష్టించారు. ఆయనతోపాటు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కనక్‌ వర్ధన్‌ సింగ్‌దేవ్, తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రవతి పరీదాలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితోపాటు మంత్రులుగా సురేశ్‌ పుజారి, రబీనారాయణ్‌ నాయక్‌, నిత్యానంద గోండ్‌, కృష్ణ చంద్ర పాత్ర ప్రమాణం చేశారు. గవర్నర్‌ రఘుబర్‌దాస్‌ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ కూడా హాజరయ్యారు.

అంతకుముందు తాజా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌తో మోహన్‌ చరణ్‌ భేటీ అయ్యారు. నవీన్‌ నివాస్‌కు వెళ్లిన ఆయన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని నవీన్‌ను స్వయంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నవీన్‌ హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 78 స్థానాల్లో విజయం సాధించిన భాజపా.. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే, గిరిజన నేత మోహన్‌ చరణ్‌ మాఝి రైతు బిడ్డ. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డుగానూ పని చేశారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచిగా పనిచేసిన మాఝి.. 2000లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. భాజపా గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన ఆయన... కేంఝర్‌ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు 2000, 2009, 2019, మళ్లీ 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకూ శాసనసభలో భాజపా సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్‌ విప్‌గా విధులు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని