Indian Railway: సెప్టెంబరు నుంచి నెలకు నాలుగు ‘వందే భారత్‌’ రైళ్లు

సెప్టెంబర్ నుంచి ప్రతి నెలా నాలుగు ‘వందే భారత్’ రైళ్లను ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. జాతీయ రైల్వే అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. ‘భారతీయ రైల్వేను ప్రపంచ...

Published : 30 May 2022 00:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెప్టెంబర్ నుంచి ప్రతి నెలా నాలుగు ‘వందే భారత్’ రైళ్లను ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. జాతీయ రైల్వే అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. ‘భారతీయ రైల్వేను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. సెప్టెంబర్ నుంచి ప్రతి నెల 4- 5 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తాం. బుల్లెట్ రైళ్ల ఏర్పాటు ప్రక్రియ కూడా పురోగతిలో ఉంది’ అని తెలిపారు.

మరోవైపు.. ఇప్పటికే న్యూదిల్లీ- వారణాసి, న్యూదిల్లీ- వైష్ణోదేవి ఖత్రా మధ్య రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని భారతీయ రైల్వే ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. మరో రెండు వందే భారత్ సెమీ-హైస్పీడ్ రైళ్లు ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది. ఈ రెండు ట్రైన్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌)లో తయారీ చివరి దశలో ఉన్నాయని పేర్కొంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. దేశవ్యాప్తంగా 75 నగరాలను కలుపుతూ 75 కొత్త వందే భారత్ రైళ్లు రానున్నాయని గత ఏడాది ఆగస్టు 15 వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వచ్చే మూడేళ్లలో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రకటించారు. మెరుగైన ఇంధన సామర్థ్యం, సౌకర్యాలు కలిగిన ‘వందే భారత్’.. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు. గంటకు దాదాపు 160 కి.మీల గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని