Fourth Wave: కరోనా నాలుగో వేవ్‌ రాకపోవచ్చు..!

ఇటీవల కాలంలో స్వల్పస్థాయిలో పెరుగుతోన్న కరోనా ఇన్ఫెక్షన్ల దృష్ట్యా.. దేశంలో నాలుగోవేవ్ రావొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. 

Published : 10 May 2022 18:09 IST

కారణాలు వెల్లడించిన తాజా అధ్యయనం

దిల్లీ: ఇటీవల కాలంలో స్వల్పస్థాయిలో పెరుగుతోన్న కరోనా ఇన్ఫెక్షన్ల దృష్ట్యా.. దేశంలో నాలుగోవేవ్ రావొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువని ఐఐటీ కాన్పూర్‌కు చెందిన మణిందర్ అగర్వాల్ వెల్లడించారు. దానికి సంబంధించి తాజా అధ్యయనంలో రెండు కారణాలను వెల్లడించారు.

ఈ రెండేళ్ల కాలంలో కరోనా వైరస్ సోకడంతో పెద్ద సంఖ్యలో ప్రజలకు సహజ రోగనిరోధక శక్తి లభించిందని తాజాగా అధ్యయనంలో గుర్తించినట్లు మణిందర్ వెల్లడించారు. ఆయన అభివృద్ధి చేసిన సూత్ర మోడల్ ప్రకారం.. 90 శాతం మంది భారతీయులకు ఈ సహజ నిరోధకత లభించినట్లు తెలిసింది. ఇది వైరస్ నుంచి బలమైన రక్షణను ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న 36 దేశాల్లో ఒమిక్రాన్‌ వేవ్‌ తీవ్రత.. అక్కడి సహజ రోగనిరోధకత స్థాయికి విలోమానుపాతంలో ఉందని గుర్తించినట్లు చెప్పారు.

ఇక రెండో కారణం.. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో చెప్పుకోదగ్గ విధంగా వైరస్‌ ఉత్పరివర్తనలను గుర్తించలేదన్నారు. చివరకు దిల్లీలోని కొవిడ్ పాజిటివ్‌ నమూనాల సీక్వెన్సింగ్‌లోనూ ఎలాంటి కొత్త ఉత్పరివర్తలు వెలుగులోకి రాలేదని ఆ అధ్యయనం పేర్కొంది. ఒమిక్రాన్ ఉపరకాలను మాత్రం గుర్తించారు. ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా పొందిన రోగనిరోధకత వీటికి వర్తిస్తుందని వ్యాఖ్యానించింది. కొవిడ్ ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడం వల్ల.. ఇటీవల కాలంలో కేసుల్లో కాస్త పెరుగుదల కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగించేదేమీ కాదని ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ సహజ రోగనిరోధక శక్తిని దాటుకొని వెళ్లే.. కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తే, నాలుగో వేవ్‌కు అవకాశం ఉంటుందని వివరించింది. వైరస్ తీవ్రతను తగ్గించుకునేందుకు టీకా ఉత్తమ ఎంపికని సూచించింది. కొవిడ్ జీరో వంటి విధానాలు అనుసరిస్తోన్న దగ్గర ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది. ఈ విధానం సహజ రోగనిరోధకతను పెంచుకునేందుకు దోహదం చేయకపోవచ్చు. దాంతో ప్రజలు ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. కొవిడ్ జీరో విధానం అనుసరిస్తోన్న చైనాలో ఇప్పుడు కరోనా ఉద్ధృతి కనిపిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని