Project 75i : ప్రాజెక్టు 75 ఐ నుంచి ఫ్రాన్స్‌ సంస్థ బయటకు..!

భారత నౌకాదళం కోసం నిర్మించనున్న ఆరు  కన్వెన్షనల్‌ సబ్‌మెరెన్ల ప్రాజెక్టు నుంచి ఫ్రాన్స్‌ సంస్థ నావల్‌ గ్రూప్‌ వైదొలగింది. ఈ విషయాన్ని

Published : 04 May 2022 00:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత నౌకాదళం కోసం నిర్మించనున్న ఆరు కన్వెన్షనల్‌ సబ్‌మెరెన్ల ప్రాజెక్టు నుంచి ఫ్రాన్స్‌ సంస్థ నావల్‌ గ్రూప్‌ వైదొలగింది. ఈ విషయాన్ని సదరు సంస్థ మంగళవారం ప్రకటించింది. ఐరోపా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మేక్రాన్‌తో భేటీ కావడానికి ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ప్రాజెక్టు 75ఐ(ఇండియా) కింద భారత్‌లో ఈ సబ్‌మెరైన్లను తయారు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్‌(ఏఐపీ) కు సంబంధించిన ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) సమస్యల కారణంగా నావల్‌ గ్రూప్‌ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. ఏఐపీ వ్యవస్థ ఉన్న కన్వెన్షనల్‌ సబ్‌మెరైన్లు సాధారణ జలాంతర్గాముల కన్నా ఎక్కువ సమయం నీటి అడుగున ఉంటుంది.

రెండు దశాబ్దాల కిందటే భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సంఘం(సీసీఎస్‌) నుంచి ‘ప్రాజెక్ట్‌ 75 ఇండియా’కు పచ్చజెండా ఊపారు. గతేడాది రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఆమోదం తెలిపింది. దీనికింద ఆరు డీజిల్‌ విద్యుత్తు జలాంతర్గాములను విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా నిర్మించనున్నారు. ఇవి ‘ప్రాజెక్టు 75’ కింద నిర్మించిన స్కార్పియన్‌ శ్రేణి జలాంతర్గాముల కంటే 50 శాతం పెద్దవిగా ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టులో రెండు భారతీయ కంపెనీలతోపాటు ఒక విదేశీ కంపెనీ కలిసి పనిచేయాల్సి ఉంది. విదేశీ కంపెనీల రేసులో జర్మనీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, రష్యా దేశాలకు చెందిన సబ్‌మెరైన్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.43,000 కోట్లు. 

నావల్‌ గ్రూప్‌ ఇండియా ఎండీ లారెంట్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆర్‌ఎఫ్‌పీలోని కొన్ని షరతుల కారణంగా, వ్యూహాత్మక భాగస్వాముల నుంచి ఎటువంటి రిక్వెస్ట్‌ రాకపోవడం కారణంగా.. ఈ ప్రాజెక్టులో అధికారిక బిడ్‌ దాఖలు చేయలేకపోతున్నాం’’ అని పేర్కొన్నారు. తమ సంస్థ భారత నౌకాదళానికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన సాంకేతికతను ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు