Google: గూగుల్‌కు భారీ జరిమానా

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. కాపీరైట్‌

Updated : 13 Jul 2021 15:45 IST

పారిస్‌: ఫ్రాన్స్‌కు చెందిన యాంటీట్రస్ట్‌ ఏజెన్సీ.. టెక్‌ దిగ్గజం గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. వార్తల ప్రచురణ విషయంలో స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆదేశాలు ఉల్లంఘించిన నేపథ్యంలో 500 మిలియన్‌ యూరోల ఫైన్‌ వేసింది. భారత కరెన్సీలో ఈ జరిమానా విలువ రూ.4,415 కోట్లు. జరిమానాపై గూగుల్‌ ప్రతినిధులు స్పందించాల్సి ఉంది.

వార్తా సంస్థలు, గూగుల్‌ మధ్య చాలా కాలంగా పోరు నడుస్తోన్న విషయం తెలిసిందే. తమ వార్తల్ని ‘గూగుల్‌ న్యూస్‌’లో ప్రచురించి ప్రకటనల రూపంలో గూగుల్‌ మాతృసంస్థ  ఆల్ఫాబెట్‌ భారీ స్థాయిలో ఆదాయం పొందుతోందని వార్తా సంస్థల యజమానుల వాదన. ప్రకటనల ఆదాయంలో తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చాయి. వివిధ మీడియా సంస్థలకు చెందిన వార్తల్ని ప్రచురించడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు గూగుల్‌కు కొంత సమయం ఇచ్చాయి.

ఫ్రాన్స్‌ యాంటీ ట్రస్ట్‌ ఏజెన్సీ సైతం స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో భారీ జరిమానా విధించాలని నిర్ణయించింది. ఫ్రాన్స్‌ ప్రభుత్వ చట్టాల్ని, నిబంధనల్ని అమలు చేయడంలో గూగుల్‌ జాప్యం చేసిందని.. తద్వారా కాపీరైట్‌ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని