France: అమెరికా, ఆస్ట్రేలియాది వెన్నుపోటు.. ఫ్రాన్స్‌ ఆగ్రహం!

అమెరికా, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన అణుజలాంతర్గాముల కొనుగోలు ఒప్పందంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్రాన్స్‌.. నిరసనగా ఆస్ట్రేలియా, అమెరికాలోని తమ రాయబారులను తక్షణమే వెనక్కి పిలుస్తున్నట్లు ప్రకటించింది.

Updated : 18 Sep 2021 11:39 IST

ప్యారిస్‌: చైనాకు చెక్‌ పెట్టేందుకు కూటమిగా ఏర్పడ్డ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే మధ్య కుదిరిన అణుజలాంతర్గాముల ఒప్పందం పెనుదుమారం రేపుతోంది. అమెరికా సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించిన అణుజలాంతర్గాముల కొనుగోలుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. దీంతో ఫ్రాన్స్‌తో చేసుకున్న 100 బిలియన్‌ డాలర్ల విలువైన జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందాన్ని ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌కు లేఖ పంపారు.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్రాన్స్‌.. నిరసనగా ఆస్ట్రేలియా, అమెరికాలోని తమ రాయబారులను తక్షణమే వెనక్కి పిలుస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా-ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఒప్పందం.. మిత్రులు, భాగస్వాముల పట్ల ఆమోదయోగ్యం కాని వైఖరిగా ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీన్‌-వేస్‌ లీ డ్రియాన్‌ పేర్కొన్నారు. దీన్ని వెన్నుపోటుగా అభివర్ణించారు. నమ్మకమైన సంబంధాలు కొనసాగిస్తున్నా.. తమ పట్ల ఆస్ట్రేలియా విశ్వాసఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ విధంగా ఫ్రాన్స్‌ రాయబారులను వెనక్కి పిలవడం ఇదే తొలిసారి. ఏళ్లుగా అమెరికా-ఫ్రాన్స్‌ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ హయాంలో అవి కాస్త దెబ్బతిన్నాయి. దీంతో బైడెన్‌ రాకను ఫ్రాన్స్‌ స్వాగతించింది. కానీ, మరోసారి విభేదాలు తలెత్తడంతో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.

భారత్-పసిఫిక్‌ ప్రాంతంలో తమ ఉమ్మడి ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా ‘ఆకస్‌’ పేరుతో కొత్త త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించాయి. రక్షణ సామర్థ్యాన్ని పంచుకోవడం దీని ప్రధాన ఉద్దేశమని మూడు దేశాలు పేర్కొన్నాయి. చైనా సైనిక ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి వీలుగా అణుశక్తితో నడిచే జలాంతర్గాములను సమకూర్చుకునేలా ఆస్ట్రేలియాకు కూటమి తోడ్పాటు ఇవ్వనుంది. భారత్‌-పసిఫిక్‌లో డ్రాగన్‌ ఆగడాలను ఎదుర్కొనేందుకు అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని