Corona Fight: భారత్‌కు బాసటగా ఫ్రాన్స్‌

కరోనాతో కుదేలవుతున్న భారత్‌కు అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలు పంపి బాసటగా నిలుస్తామని ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, వెంటిలేటర్లు కూడా పంపనున్నట్లు ఫ్రాన్స్‌ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది....

Updated : 27 Apr 2021 15:22 IST

ఔషధాలు, వైద్య పరికరాలు పంపుతున్నట్లు వెల్లడి

పారిస్‌: కరోనాతో కుదేలవుతున్న భారత్‌కు అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలు పంపి బాసటగా నిలుస్తామని ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు, వెంటిలేటర్లు కూడా పంపనున్నట్లు ఫ్రాన్స్‌ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఈ విషయంపై భారత్‌లోని రాయబార కార్యాలయం ద్వారా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిపింది. ఈ వారాంతానికి సముద్ర మార్గం, వాయు మార్గాల ద్వారా ఫ్రాన్స్‌ సాయం భారత్‌కు చేరుతుందని స్పష్టం చేసింది. భారత్‌లో ఉన్న ఫ్రెంచ్‌ సంస్థలతో పాటు.. ఐరోపా వ్యాప్తంగా ఉన్న సంస్థలు భారత్‌కు ఫ్రాన్స్‌ చేస్తున్న సాయంలో కలిసి వస్తున్నట్లు భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్‌ లెనైన్‌ తెలిపారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మేక్రాన్‌ విజ్ఞప్తి మేరకు ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించినట్లు లెనైన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. భారత్‌కు పంపుతున్న ఎనిమిది ఆక్సిజన్‌ జనరేటర్లలో ప్రతి ఒక్కటి 250 పడకల ఆసుపత్రికి పదేళ్ల పాటు ప్రాణవాయువు సరఫరా చేయగల సామర్థ్యం ఉన్నవన్నారు. ఐదు కంటైనర్ల మేర ద్రవ ఆక్సిజన్‌ కూడా తొలి విడతలో పంపుతున్నామని, దాదాపు 10 వేల మంది రోగులకు ఒక రోజుకు సరిపడా ఆక్సిజన్‌ను అవి సమకూర్చగలవని లెనైన్‌  వివరించారు. వీటితోపాటు 28 వెంటిలేటర్లు, 200 వరకు ఎలక్ట్రిక్‌ సెరెంజ్‌ పంపులు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా భారత్‌లోని ఆస్పత్రుల సామర్థ్యం బలపడగలదని  ఆయన అభిప్రాయపడ్డారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని