Arvind Kejriwal: ప్రజలు పేదలుగా ఉంటే.. దేశం ధనికంగా మారదు.. కేంద్రంపై కేజ్రీవాల్‌ కౌంటర్‌

దేశంలో వైద్యం, విద్యా సౌకర్యాలను  మెరుగుపర్చాలని కేంద్రం భావిస్తే వారితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు........

Published : 16 Aug 2022 18:20 IST

దిల్లీ: దేశంలో వైద్యం, విద్యా సౌకర్యాలను  మెరుగుపర్చాలని కేంద్రం భావిస్తే వారితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఉచిత విద్య, వైద్యం పథకాలను ‘‘ఉచితాలు’’గా పరిగణించకూడదని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సూచించారు. పేదలకు మంచి విద్య అందకుంటే.. వారు పేదలుగానే మిగిలిపోతారని, దేశం ధనికంగా మారదన్నారు.

ఉచిత పథకాలు ప్రమాదకరమంటూ ఇటీవల ప్రధాని మోదీ ప్రస్తావించిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ మరోసారి స్పందించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘విద్య, వైద్యాన్ని మెరుగుపర్చేందుకు కేంద్రంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ వాటిని ఉచితాలుగా పిలవద్దని భాజపా సర్కారును కోరుతున్నా. దేశంలోని ప్రతి చిన్నారికి మంచి, ఉచిత విద్య అందాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్యం అందాలి. ఈ అంశాలపై ఇప్పటినుంచే యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి. అప్పుడే దేశం అగ్రస్థానంలో నిలుస్తుంది’ అని అన్నారు.

భారత్‌ను ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా చూడాలన్నదే తన కోరిక అని కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘ప్రతి భారతీయుడు ధనవంతుడిగా మారినప్పుడే భారత్‌ ధనిక  దేశంగా మారుతుంది. ప్రజల వద్ద డబ్బు లేకపోతే అది ఎలా జరుగుతుంది?’ అని అన్నారు. పేదవాడు ధనవంతుడిలా ఊరికే మారిపోలేడని.. పేద పిల్లలకు సర్కారు బడుల్లో ఉత్తమ విద్య అంది, వారు మంచి ఉద్యోగం సంపాదిస్తే.. పేదరికంలోనుంచి బయటపడటమే కాకుండా, కుటుంబాన్ని కూడా బయటపడేస్తారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని