Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్‌ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్‌!

ఉచిత రీఛార్జ్‌ పేరుతో వాట్సాప్‌(WhatsApp)లో వస్తోన్న మెసేజ్‌లను నమ్మవద్దని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ (PIB Fact Check) విభాగం నిర్ధరించింది. అందులోని లింక్‌పై క్లిక్ చేయొద్దని మొబైల్ యూజర్లకు సూచించింది.

Published : 27 Mar 2023 01:38 IST

దిల్లీ: నకిలీ వార్తల (Fake News) కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ.. ప్రజలను మోసగించే అసత్య వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా వాట్సాప్‌ (WhatsApp)లో మరో మెసేజ్‌ చక్కర్లు కొడుతోంది. దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 28 రోజుల వ్యాలిడిటీతో  రూ. 239 రీఛార్జ్‌ చేస్తుందని,  ఉచిత రీఛార్జ్‌ కోసం మెసేజ్‌లోని వెబ్ లింక్‌పై క్లిక్ చేయాలనేది అందులోని సారాంశం. అయితే, ఈ మెసేజ్‌ నకిలీదని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్ చెక్‌ (PIB Fact Check) విభాగం నిర్థారించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్వీట్‌ చేసింది.

‘‘కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రీఛార్జ్‌ చేస్తుందని వాట్సాప్‌లో వస్తోన్న మెసేజ్‌ను నమ్మవద్దు. కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. యూజర్లు ఈ మెసేజ్‌ను నమ్మొద్దు’’ అని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ట్వీట్‌లో పేర్కొంది. ఒకవేళ యూజర్లకు ఈ మెసేజ్‌ వస్తే లింక్‌పై క్లిక్‌ చేయొద్దని సూచించింది. లింక్‌పై క్లిక్‌ చేసిన తర్వాత సైబర్‌ నేరగాళ్లు యూజర్‌ మొబైల్‌లోకి వైరస్‌ను ప్రవేశపెట్టి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారని తెలిపింది. నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు పీఐబీ ప్రత్యేకంగా ఫ్యాక్ట్‌చెక్ విభాగాన్ని ఏర్పాటు చేసింది.

కొద్దిరోజుల క్రితం రూ. 24,000 డిపాజిట్‌ చేసిన వారికి కేంద్రం రూ. 8 లక్షలు రుణం ఇస్తుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వార్త కూడా నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ తేల్చింది. దాంతోపాటు ఎస్‌బీఐ (SBI) బ్యాంక్‌  ఖాతాదారులు పాన్‌ అప్‌డేట్‌ చేయకపోతే.. ఖాతా పనిచేయదని, అందుకోసం  మెసేజ్‌లోని లింక్‌పై క్లిక్ చేయాలని మరో వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అది కూడా నకిలీదేనని, ఎస్‌బీఐ ఖాతాదారులను అలాంటి మెసేజ్‌ పంపలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ నిర్థారించింది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు