Darshan controversies: నటుడు దర్శన్‌ వివాదాలకు కొత్తేమీ కాదు..!

కన్నడ నటుడు దర్శన్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కోవడంతో అతడి పేరు వార్తల్లో నిలిచింది. 

Published : 17 Jun 2024 16:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన సహనటి పవిత్రాగౌడకు అభ్యంతరకర సందేశాలు పంపాడని ఓ అభిమానిని కొట్టి చంపిన కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్‌ (Darshan) గతంలో పలు వివాదాల్లో ఇరుక్కున్నాడు. 1990ల్లో యాక్టింగ్‌ కెరీర్‌ మొదలుపెట్టిన అతడికి 2002లో మెజిస్టిక్‌ రూపంలో తొలి బ్రేక్‌ లభించింది. ఆ తర్వాత అతడి సినీగ్రాఫ్‌ వేగంగా పెరిగింది. కన్నడ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో చేరాడు. నిజజీవితంలో అతడికి వివాదాలు కొత్తేమీ కాదు. పలుమార్లు ప్రతికూల ప్రచారంతోనే అతడు వార్తల్లో నిలిచాడు. 

భార్యపై దాడి ఆరోపణలతో..

2011లో దర్శన్‌ దాడి చేశాడని ఆరోపిస్తూ అతడి భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గృహహింస కింద అతడిని పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజులపాటు పరప్పన అగ్రహార జైల్లో గడిపి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కోర్టు బయట రాజీ చేసుకొన్నాడు. 

రోడ్డు ప్రమాదం..

2018లో ఉత్తర మైసూర్‌లో నటులు దర్శన్‌, దేవ్‌రాజ్‌ వారి మిత్రుడు ఆంటోనీలు ప్రయాణిస్తున్న విలాసవంతమైన కారు ఓ కరెంటు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో దర్శన్‌ కారును డ్రైవ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. పోలీసులు ఆ వాహనంలో ఉన్న ఆంటోనీపై కేసు నమోదు చేశారు.

వెయిటర్‌పై దాడి..

2021లో మైసూర్‌లోని ఓ హోటల్‌ వెయిటర్‌పై దర్శన్‌ దాడి చేశాడు. ఈ గొడవకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు మాయమయ్యాయి. చివరికి ఎలాగోలా బాధితుడికి కొంత మొత్తం చెల్లించి రాజీ చేసుకొన్నట్లు ప్రచారం జరిగింది.

వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘన..

కెంపైనహుండిలోని దర్శన్‌ ఫామ్‌హౌస్‌లో కొన్ని అరుదైన పక్షులను అక్రమంగా బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి అతడిపై కేసు కూడా నమోదైంది. పక్షులను బంధించిన విజువల్స్‌ బయటకు వచ్చాయి. మరోసారి అతడు పులిగోరు ధరించిన ఫొటోలు బహిర్గతం కావడంతో.. అటవీశాఖ అతడి ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. 

మహిళపై దాడి..

2023లో దర్శన్‌కు చెందిన కుక్క ఒక మహిళపై దాడి చేసింది. దీనికి సంబంధించి అతడిపై కేసు నమోదైంది. దర్శన్‌కు చెందిన మూడు కుక్కలు తన కారు పక్కనే ఉన్నట్లు గ్రహించిన పొరుగింటి మహిళ వాటిని తీసుకెళ్లాలని దర్శన్‌ సహాయకుడికి చెప్పింది. ఈసందర్భంగా వారి మధ్య వివాదం మొదలైంది. అంతలోనే ఓ కుక్క ఆ మహిళపై దాడి చేసింది. ఆ సమయంలో దర్శన్‌ అక్కడ లేడు. 

తాజాగా పవిత్రాగౌడకు అభ్యంతరకర సందేశాలు పంపాడంటూ ఓ అభిమానిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కనికరించమని సదరు అభిమాని బతిమాలినా దర్శన్‌ మనుషులు పట్టించుకోకుండా హత్య చేసినట్లు కథనాలు వస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు