Mehul Choksi: మళ్లీ కిడ్నాప్‌ చేస్తారేమో..!

మరోసారి తాను కిడ్నాప్‌కు గురవుతానేమోనని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీ ఆందోళన చెందుతున్నాడని ఓ ఆంగ్ల వార్త సంస్థ పేర్కొంది. ఈ నెల మొదట్లో చోక్సీ బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం

Published : 29 Nov 2021 18:11 IST

* పీఎన్‌బీ కుంభకోణం కేసులో నిందితుడు మెహూల్‌ చోక్సీ

ఇంటర్నెట్‌డెస్క్‌: మరోసారి తాను కిడ్నాప్‌నకు గురవుతానేమోనని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీ ఆందోళన చెందుతున్నట్లు ఓ ఆంగ్ల వార్త సంస్థ పేర్కొంది. ఈ నెల మొదట్లో చోక్సీ బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాను ప్రయాణాలు చేయలేనని.. పరారీలో ఉన్న నేరగాడి కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అమలు చేసే ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరిన విషయం తెలిసిందే.

‘‘నేను మరోసారి కిడ్నాప్‌నకు గురవుతానేమో. అక్కడి నుంచి గయాన తరలించవచ్చు. అక్కడ భారత్‌ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. దానిని వాడుకొని అక్రమ మార్గాల్లో భారత్‌కు తరలించే అవకాశం ఉంది. నేను ఇప్పుడు అంటిగ్వాలోని నా ఇంట్లోనే ఉంటున్నాను. అనారోగ్య కారణాలతో ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. దీనికి తోడు భారతీయుల చేతిలో నేను చాలా దారుణమైన అనుభవాన్ని చవిచూశాను. దాని నుంచి కోలుకోలేను. గత అనుభవాలు, తీవ్రమైన భయం కారణంగా నా మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. మా డాక్టర్లు చెప్పకుండా ఇంటిబయట కాలు పెట్టే పరిస్థితి లేదు’’ అని చోక్సీ పేర్కొన్నట్లు ఆ వార్త సంస్థ వెల్లడించింది.

ఈ ఏడాది మే 23న ఆంటిగ్వాలో ఉన్నట్టుండి అదృశ్యమైన ఛోక్సీ రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. క్యూబా పారిపోయే ప్రయత్నంలో డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించడంతో అతడిని అరెస్టు చేశారు. అయితే, ఛోక్సీని కిడ్నాప్‌ చేసి బలవంతంగా డొమినికా తీసుకెళ్లారని ఆయన తరఫు న్యాయవాదులు బలంగా ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే ఛోక్సీ గతంలో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. పారిపోయే అవకాశం ఉన్నందున అతడి పిటిషన్‌ను డొమినికా కోర్టు తిరస్కరించింది. అయితే జులైలో అనారోగ్య కారణాల దృష్ట్యా మరోసారి బెయిల్‌ కోసం ఛోక్సీ అభ్యర్థించారు. తీవ్రమైన హెమటోమాతో బాధపడుతున్న అతడికి వెంటనే న్యూరాలజిస్టు, న్యూరో సర్జికల్‌ కన్సల్టెంట్‌తో చికిత్స అందించాలని వైద్యులు సిఫార్సు చేశారు. అయితే ప్రస్తుతం ఆ వైద్య సేవలు డొమినికాలో అందుబాటులో లేకపోవడంతో ఆంటిగ్వా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఛోక్సీ కోరారు. దీంతో ఛోక్సీకి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 10 వేల కరీబియన్‌ డాలర్ల (సుమారు రూ.2.75 లక్షలు)ను పూచీకత్తుగా సమర్పించాలని అక్కడి కోర్టు ఆదేశించింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను రూ. 13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఛోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్‌ మోదీ ప్రధాన నిందితులు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే ఛోక్సీ భారత్‌ నుంచి పారిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని