Modi: పరిశోధన..ఆవిష్కరణ..మన జీవన విధానంలో భాగం: మోదీ

పరిశోధన, ఆవిష్కరణలు భారతీయుల జీవన విధానంలో భాగమని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న వైవిద్యం అందులో భాగమేనని తెలిపారు.

Published : 24 Dec 2022 21:45 IST

రాజ్‌కోట్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా విద్యా వ్యవస్థకు రూపకల్పన చేశామని ప్రధాని మోదీ (Modi) అన్నారు. భారతదేశం గతంలో కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శించారు. రాజ్‌కోట్‌ (Rajkot) లోని శ్రీ స్వామి నారాయణ్‌ గురుకుల్‌ 75వ అమృత మహోత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ (Video Conference) ద్వారా ప్రధాని ప్రసంగించారు. 2014లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఐటీ (IIT), ఐఐఎం (IIM) లాంటి ప్రముఖ విద్యా సంస్థలను గణనీయంగా పెంచామన్నారు.

భారతదేశపు ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని ప్రశంసించిన ప్రధాని.. అత్యున్నత జీవితం గడపాలంటే విజ్ఞాన సముపార్జనే సరైన మార్గమన్నారు. విద్యారంగంలో దేశం కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించేందుకు సాధువులు, ఆధ్యాత్మిక వేత్తలు ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ‘‘ భారతదేశ ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రస్తుత విద్యా విధానం, విద్యా సంస్థలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. అందువల్ల దేశంలో విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. 2014 తర్వాత దేశ వ్యాప్తంగా వైద్యకళాశాల సంఖ్య 65 శాతం పెరిగింది. ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం లాంటి ఉన్నత విద్యా సంస్థలను కూడా పెద్ద సంఖ్యలో  ఏర్పాటు చేశాం’’ అని మోదీ అన్నారు.

విద్యా రంగంలో ప్రపంచ దేశాలకు భారత్‌ మార్గదర్శిగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. ఆత్మతత్వం నుంచి పరమాత్మ తత్వం వరకు, ఆధ్యాత్మికత నుంచి ఆయుర్వేదం వరకు, సోషల్‌ సైన్స్‌ నుంచి సోలార్‌ సైన్స్‌ వరకు ఇలా అన్నింటా ప్రపంచదేశాలు భారత్‌ను అనుసరించాయని అన్నారు. లింగ సమానత్వం అనే అంశం తెరమీదకు రాకముందే భారత్‌లో మహిళలు, పురుషులతో  పోటీ పడ్డారని అన్నారు. అప్పటి గురుకులాలు గార్గి, మైత్రేయి తదితర మహిళా పండితులను చర్చల్లో భాగం చేసి..లింగ సమానత్వంపై ప్రపంచానికి మార్గనిర్దేశం చేశాయని కొనియాడారు. ఇతర దేశాలు, రాజ్యాలు ఆయా రాజవంశాలతో గుర్తింపు పొందిన కాలంలో భారత్‌ మాత్రం గురుకులాల ద్వారా గుర్తింపు పొందింది’’ అని మోదీ అన్నారు.

కొన్ని శతాబ్దాలుగా.. భారతదేశంలోని గురుకులాలు సమానత్వం, సేవ, ఆప్యాయతకు ఉద్యానవనంలా మారాయని మోదీ అన్నారు. నలందా, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు భారతదేశ వైభవానికి పర్యాయపదాలుగా ఉండేవన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు భారతదేశ జీవన విధానంలో భాగమని, ప్రస్తుతం మనం చూస్తున్న వైవిధ్యం వాటి ఫలితమేనని మోదీ అన్నారు. శ్రీ స్వామి నారాయణ్‌ గురుకుల్‌ నుంచి కనీసం 100-150 మంది వాలంటీర్లను ఈశాన్య రాష్ట్రాలకు పంపాలని మోదీ కోరారు. అక్కడి యువతతో మాట్లాడాలని, వారి జీవన విధానం గురించి రాయాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు