
G20 Summit: జి-20 సదస్సులో ఆర్థిక దిగ్గజాల సమావేశం.. పాల్గొన్న మోదీ
రోమ్: ఐదు రోజుల ఐరోపా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇటలీలో రెండు రోజులపాటు జరిగే జి-20 సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచంలోని ఆర్థిక దిగ్గజ దేశాధినేతలు కొవిడ్ తర్వాత తొలిసారి ఈ సదస్సులో సమావేశమయ్యారు. వాతావరణ మార్పులు, కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ప్రపంచస్థాయిలో కనీస కార్పొరేట్ ట్యాక్స్ వంటి అంశాలపై చర్చించారు. ఆదివారం సైతం ఈ సమావేశం కొనసాగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి సదస్సు వేదిక వద్ద దేశాధినేతలకు స్వాగతం పలికారు.
బైడెన్‌తో ఆప్యాయంగా..
పలు చర్చల అనంతరం నేతలంతా ఓ ‘ఫ్యామిలీ ఫొటో’ దిగారు. హెల్త్‌కేర్ ఫ్రంట్‌లైన్ కార్యకర్తలను ఆ ఫొటోలో భాగం చేయడం విశేషం. ఫ్యామిలీ ఫొటోకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్‌తో ప్రధాని మోదీ కొద్దిసేపు సంభాషించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆయనతో కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు.
పేద దేశాల్లో 3 శాతం మందికే టీకాలు
సదస్సు ప్రారంభ సెషన్‌లో ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థపై జి-20 దేశాధినేతలు దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి మాట్లాడుతూ.. ప్రపంచంలోని పేద దేశాలకు కొవిడ్ టీకాలను అందించేందుకు మరింత కృషి చేయాలని అధినేతలకు పిలుపునిచ్చారు. సంపన్న దేశాల్లో 70 శాతం మందికి టీకాలు వేయగా.. పేద దేశాల్లో కేవలం 3 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్లు అందాయని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమంపైనా దేశాధినేతలు చర్చించారు. ఈ భేటీ అనంతరం మోదీ సహా చాలా మంది దేశాధినేతలు ఐరాస నిర్వహించే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందులో పాల్గొంటారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.