G7 Summit: కీలకాంశాలపై ఒకే తాటిపై సభ్యదేశాలు!

యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి వణికిస్తోన్న వేళ.. ధనిక దేశాల అధినేతలు నేరుగా పాల్గొన్న G-7 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది.

Published : 13 Jun 2021 20:51 IST

ముగిసిన జి-7 శిఖరాగ్ర సదస్సు

లండన్‌: యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్‌ మహమ్మారి వణికిస్తోన్న వేళ.. అభివృద్ధి చెందిన దేశాల అధినేతలు నేరుగా పాల్గొన్న G-7 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌, వాతావరణ మార్పులు, భవిష్యత్తులో సంభవించే మహమ్మారులకు అడ్డుకట్ట, చైనా నుంచి పొంచివున్న ముప్పు వంటి కీలక అంశాలపై కలిసి పనిచేసేందుకు ఏడు సభ్య దేశాలు అంగీకరించాయి. మూడురోజుల పాటు జరిగిన జి-7 సదస్సు సానుకూల వాతావరణంలో కొనసాగినట్లు ఆయా దేశాధినేతలు ప్రకటించారు.

100కోట్ల డోసులకు హామీ..

కరోనా వైరస్‌ విలయతాండవంతో చాలా దేశాలు వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. అలాంటి పేద దేశాలకు సహాయం అందించేందుకు 100కోట్ల డోసులను అందించాలని జి-7 కూటమి నిర్ణయించింది. వీటిలో సగం డోసులను కేవలం ఒక్క అమెరికానే అందిస్తుండగా, మిగతా వాటిని ఇతర సభ్యదేశాలు సమకూరుస్తాయని బ్రిటన్‌ ప్రధాని హామీ ఇచ్చారు. డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలో ఏర్పాటైన ‘కొవాక్స్‌’తో పాటు వివిధ దేశాలకు నేరుగా వీటిని అందిస్తామని తెలిపారు. వర్చువల్‌ విధానంలో జి-7 సదస్సుకు హాజరైన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌... మహమ్మారిపై విజయం సాధించాలంటే దాదాపు 1100 కోట్ల డోసులు అవసరమవుతాయని పేర్కొన్నారు. ఇందుకోసం జి-7 దేశాలు మరిన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు.

తొలి 100 రోజుల్లోనే కళ్లెం..

భవిష్యత్తులో కొత్త రకం వైరస్‌లు ఎప్పుడు బయటపడినా.. వాటిని గుర్తించిన తొలి 100 రోజుల్లోనే కట్టడి చేయాలని జి-7 కూటమి సంకల్పించింది. ఇందుకు అన్ని సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. ఈ ప్రక్రియలో భాగంగా జంతువుల టీకా అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని బ్రిటన్‌ పేర్కొంది. మహమ్మారులను ఎదుర్కోవడంలో ప్రపంచ ఆరోగ్య రంగంలోనే మైలురాయి వంటి తీర్మానాన్ని జి-7 కూటమి ఆమోదించినట్లు తెలిపింది. ఇలాంటి మహమ్మారులు మళ్లీ విరుచుకుపడకుండా చూడాలంటే గత 18 నెలల అనుభవాలతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయపడ్డారు.

వాతావరణ మార్పులు.. చైనాపై దృష్టి..

వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలపై జి-7 సదస్సు కీలకంగా చర్చించింది. కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో పేద దేశాలను ఆదుకునేందుకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై చర్చించింది. పునరుత్పాదక శక్తిని విరివిగా పెంచడంలో భాగంగా ఆఫ్రికాలో రైల్వే సదుపాయాల నుంచి ఆసియాలో పవన విద్యుత్తు ప్లాంట్ల అభివృద్ధి వరకు వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. చైనా అభివృద్ధి చేస్తోన్న ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ ప్రాజెక్టుకు ప్రతిస్పందనగా జి-7 దేశాలు ‘బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌ ఫర్‌ ది వరల్డ్‌’ పేరుతో పలు దేశాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు సమాచారం. ఇక చైనాలోని షిన్‌జియాంగ్‌తో పాటు హాంగ్‌కాంగ్‌లో మానవ హక్కులను గౌరవించాలని జి-7 దేశాలు చైనాకు సూచించాయి.

ఒకే ఆరోగ్య వ్యవస్థకు మోదీ పిలుపు

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు భారత్‌ మద్దతు ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇందుకోసం ‘వన్‌ ఎర్త్‌-వన్‌ హెల్త్‌’ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జి-7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా జరిగిన ‘బిల్డింగ్‌ బ్యాక్‌ స్ట్రాంగర్‌-హెల్త్‌’ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ.. భవిష్యత్ మహమ్మారులను నివారించడానికి ప్రపంచ ఐక్యత, నాయకత్వం, సహకారం కావాలని జి-7 వేదికగా పిలుపునిచ్చారు. జి-7 కూటమిలో భారత్‌ సభ్యదేశం కానప్పటికీ అతిథి దేశంగా పాల్గొన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని