Nitin Gadkari: దేశంలో 35% కాలుష్యం పెట్రోల్‌, డీజిల్‌ వల్లే..!

క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతితోపాటు కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రత్యామ్నాయ ఇంధనాలు (Alternative Fuels) వాడక తప్పదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) స్పష్టం చేశారు.

Published : 18 Aug 2022 20:11 IST

ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం తప్పదన్న కేంద్ర మంత్రి

ముంబయి: క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతితో పాటు కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రత్యామ్నాయ ఇంధనాలు (Alternative Fuels) వాడక తప్పదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) స్పష్టం చేశారు. దేశంలో నమోదవుతున్న కాలుష్యంలో 35శాతం కేవలం డీజిల్‌, పెట్రోల్‌ వాడకం వల్లేనని ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని, దిగుమతులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో తొలిసారి డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రికల్‌ బస్‌ను ముంబయిలో ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి ఈ విధంగా మాట్లాడారు.

‘క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం మన దేశానికి అతిపెద్ద సవాల్‌. ప్రస్తుతం వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తీరును చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితి సామాన్య పౌరుడికి తీవ్ర ఇబ్బందులు కలిగించేదే. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాలైన ఎలక్ట్రిసిటీ, ఇథనాల్‌, మిథనాల్‌, బయోడీజిల్‌, బయో-సీఎన్‌జీ, బయో-ఎల్‌ఎన్‌జీతోపాటు హైడ్రోజన్‌ వంటివి వాడకానికి ఇదే సరైన సమయం. డీజిల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్‌ వాహనాలు ఎంతో తక్కువ ఖర్చులో లభిస్తాయి’ అని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో ఆటోమొబైల్‌ రంగం విలువ రూ. 7.5లక్షల కోట్లకు చేరిందని చెప్పిన కేంద్ర మంత్రి గడ్కరీ.. 2024 నాటికి ఈ రంగాన్ని రూ.15లక్షల కోట్లకు తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా ఉండడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో భారీ ఆదాయాన్ని సమకూరుస్తోందన్నారు. ఇదిలాఉంటే, హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ అశోక్‌ లేల్యాండ్‌ ఎలక్ట్రిక్‌ విభాగానికి చెందిన ఈ కంపెనీ EiV 22 పేరిట ముంబయిలో ప్రారంభించింది. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సును కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆవిష్కరించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts