Nitin Gadkari: కేంద్ర మంత్రి గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్‌ కాల్‌!

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari)కి మరోసారి బెదిరింపు ఫోన్‌ కాల్ వచ్చింది. సోమవారం అర్థరాత్రి సమయంలో ఫోన్‌ కాల్ వచ్చినట్లు మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు. దీనిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Published : 16 May 2023 18:57 IST

దిల్లీ: కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి, భాజపా సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari)కి మరోసారి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. దిల్లీ (Delhi)లోని మోతీలాల్‌ నెహ్రూ రోడ్‌లో ఉన్న ఆయన అధికారిక నివాసానికి సోమవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

‘‘సోమవారం అర్థరాత్రి కేంద్ర మంత్రి అధికారిక నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. మంత్రిగారితో మాట్లాడాలని, ఆయనను హెచ్చరించాలని హిందీలో చెబుతూ ఫోన్‌ కట్‌ చేశాడు’’ అని మంత్రి కార్యాలయ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు. ‘‘మంత్రి కార్యాలయానికి వచ్చిన బెదిరింపు ఫోన్‌ కాల్‌ వివరాలు సేకరిస్తున్నాం. నిందితుడు ల్యాండ్‌లైన్‌ నంబర్‌ నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించాం. దీనిపై పూర్తి దర్యాప్తు జరిపి నిందితుణ్ని అరెస్ట్‌ చేస్తాం’’ అని పోలీస్‌ అధికారి తెలిపారు. 

గతంలో కూడా నాగ్‌పూర్‌లోని నితిన్ గడ్కరీ కార్యాలయానికి రెండుసార్లు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. రూ.10కోట్లు ఇవ్వకపోతే ఆయన ప్రాణాలకు హాని కలిగిస్తామంటూ జయేశ్‌ పుజారీ అనే వ్యక్తి మూడు సార్లు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ జరిపి నిందితుడిపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని