Nitin Gadkari: కొందరు సీఎంలు కూడా సీట్‌ బెల్ట్‌ పెట్టుకోరు: గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ప్రజల సహకారం లేకుండా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చేసే ప్రయత్నాలు ఫలించవని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు.

Updated : 06 Sep 2022 16:28 IST

దిల్లీ: ప్రజల సహకారం లేకుండా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు చేసే ప్రయత్నాలు ఫలించవని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు. చివరకు ముఖ్యమంత్రులు కూడా సీట్ బెల్ట్‌ వంటి భద్రతా నియమాలు పాటించరని అసహనం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో సీట్‌ బెల్ట్ ప్రాముఖ్యత గురించి ప్రముఖులు, నిపుణులు ప్రస్తావిస్తున్నారు. 

‘వెనక సీట్లలో కూర్చునే ప్రయాణికులు సీట్ బెల్ట్‌ పెట్టుకోవాల్సిన పనిలేదని అనుకుంటారు. ఇక్కడ నేను ఏ రోడ్డు ప్రమాదం గురించి ప్రస్తావించడం లేదు. కానీ ముందు, వెనక సీట్లలో కూర్చొన్న ప్రతి ఒక్కరు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాల్సిందే. సామాన్యుల గురించి వదిలేయండి. నేను పలువురు ముఖ్యమంత్రులతో కారులో ప్రయాణించిన సందర్భాలున్నాయి. వారి పేర్లు మాత్రం అడగొద్దు. వారితో ప్రయాణించేప్పుడు నేను ముందు సీట్‌లో కూర్చున్నాను. ఆ సమయంలో వారు కారు భద్రతా నియమాలు పాటించలేదు. ఒకవేళ మనం బెల్ట్‌ పెట్టుకోకపోతే అలారం మోగుతుంది. కానీ డ్రైవర్లు క్లిప్‌ పెట్టి అలారం ఆపేవారు. ఇక్కడ మనకు సహకారం ఉంటేనే ప్రమాదాలు ఆగుతాయి’ అని ఓ సదస్సులో మాట్లాడుతూ గడ్కరీ వెల్లడించారు. 

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా గడ్కరీ.. కార్లకు ఆరు ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరి చేసే ప్రక్రియలో ఉన్నారు. ఒక్కో ఎయిర్‌ బ్యాగు నిమిత్తం అదనంగా ఖర్చవుతుంది. దీంతో కార్ల ధరలు పెరుగుతాయని, కొనుగోళ్లు తగ్గుతాయని తయారీదారులు అంటున్నారు. ‘విదేశాల్లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. భారత్‌లోని పేదల ప్రాణాలకు విలువ లేదా..?’ అని పరిశ్రమ వర్గాల అభిప్రాయాన్ని గడ్కరీ తోసిపుచ్చారు. 

మరోవైపు, దేశంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా 2021లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏకంగా 1.55లక్షల మంది దుర్మరణం చెందారు. అంటే సగటున ప్రతి గంటకు 18 మంది మరణిస్తుండగా, ఒక్కరోజులో 426మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలే కాకుండా గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన 4.03 లక్షల ప్రమాదాల్లో 3.71 లక్షల మంది గాయపడినట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (NCRB) నివేదిక పేర్కొంది. ‘భారతదేశంలో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు-2021’ కింద ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన నివేదికలో ఈ గణాంకాలను వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని