Vehicle Scraping: 9 లక్షలకుపైగా ప్రభుత్వ వాహనాలు తుక్కుకు: గడ్కరీ

15 ఏళ్లు దాటిన తొమ్మిది లక్షలకుపైగా ప్రభుత్వ వాహనాలను ఏప్రిల్‌ 1 నుంచి తుక్కుకు తరలించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కొత్త వాహనాలు వస్తాయని చెప్పారు.

Published : 30 Jan 2023 17:14 IST

దిల్లీ: 15 సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన తొమ్మిది లక్షలకు పైగా వాహనాలను ఏప్రిల్ 1 నుంచి వినియోగంలో నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు. వాటి స్థానంలో కొత్త వాహనాలు రానున్నాయని చెప్పారు. పరిశ్రమల సంస్థ ‘ఫిక్కీ(FICCI)’ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గడ్కరీ పాల్గొని ప్రసంగించారు. ‘15 ఏళ్లు దాటిన తొమ్మిది లక్షలకు పైగా ప్రభుత్వ వాహనాలను స్క్రాప్(Vehicle Scrapping) చేసేందుకు ఆమోదించాం. దీంతో కాలుష్యకారక బస్సులు, కార్లు పక్కకెళ్లిపోతాయి. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే కొత్త వాహనాలు వస్తాయి. ఫలితంగా వాయు కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది’ అని తెలిపారు. ఇథనాల్, మిథనాల్, బయో- సీఎన్‌జీ, బయో- ఎల్‌ఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.

పదిహేనేళ్లు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను ఏప్రిల్‌ 1 నుంచి తుక్కుగా పరిగణించనున్న విషయం తెలిసిందే. వాటి రిజిస్ట్రేషన్లను ఉపసంహరించనున్నారు. ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులకూ ఈ నిబంధన వర్తించనుంది. ‘ప్రాథమిక రిజిస్ట్రేషన్‌ నమోదై 15 ఏళ్లు పూర్తయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను వదిలించుకోవాలి. వాటిని చట్టప్రకారం రిజిస్టరైన వాహన తుక్కు పరిశ్రమలకు తరలించాలి’ అని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సైన్యం, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం వినియోగించే వాహనాలకు మినహాయింపు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని