Nitin Gadkari: పోస్టర్లు, బ్యానర్లు లేకుండానే ఎన్నికలకు వెళ్తా: గడ్కరీ కీలక వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల నుంచి తాను ప్రచారం చేయబోనని చెప్పారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari). పోస్టర్లు, బ్యానర్లతో కాకుండా ప్రజా సేవతోనే విజయం సాధిస్తానని విశ్వాసం ప్రకటించారు. 

Published : 15 May 2023 18:09 IST

సికార్‌ (రాజస్థాన్‌): ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రజలకు చేసిన సేవ ఆధారంగానే తాను ఓట్లు గెల్చుకుంటానని కేంద్రమంత్రి (Union Minister), భాజపా (BJP) నేత నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నుంచి తాను ఎటువంటి పోస్టర్లు, బ్యానర్లు పెట్టబోనని చెప్పారు. రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గం నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేశాను. అక్కడి నుంచి పోటీ చేయొద్దని చాలా మంది నాకు చెప్పారు. కానీ నేను వెనక్కి తగ్గలేదు. దృఢ సంకల్పంతో పోటీ చేసి విజయం సాధించా. ఇప్పుడు నేను కీలక నిర్ణయం తీసుకున్నా. వచ్చే ఎన్నికల నుంచి నేను ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం చేయను. ఓటర్లకు ఛాయ్‌ కూడా ఇవ్వను. నాకు ఓటు వేయాలనుకున్న వాళ్లు వేస్తారు. వద్దనుకున్నవారు వేయరు. ప్రజా సేవ, అభివృద్ధి, ప్రజల సంక్షేమం, వారికి మంచి ఆరోగ్య సదుపాయాలు, యువతకు ఉపాధి కల్పించడం, చిన్నారులకు మెరుగైన విద్యను అందించడం వంటి అంశాల ఆధారంగా ఓట్లు గెల్చుకోవాలి’’ అని గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆ ప్రజా సేవ ఆధారంగానే తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రాజకీయ సేవ అనేది పుస్తకాలు చదివితేనో.. చర్చా వేదికలు నిర్వహిస్తేనే రాదని గడ్కరీ (Nitin Gadkari) అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆయన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ (Nagpur) నుంచి పోటీ చేసి విజయం సాధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు