త్వరలో గగన్‌యాన్‌ మొదటి దశ ప్రయోగం..!

మానవులను అంతరిక్షంలోకి పంపే పరిశోధనల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘మానవ సహిత గగన్‌యాన్’ ప్రయోగానికి భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించడంతో

Updated : 08 Jun 2021 04:57 IST

బెంగళూరు: మానవులను అంతరిక్షంలోకి పంపే పరిశోధనల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘మానవ సహిత గగన్‌యాన్’ ప్రయోగానికి భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) సిద్ధమవుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించడంతో కొంచెం ఆలస్యమయ్యింది. బెంగళూరులో లాక్‌డౌన్‌ ఎత్తేసిన వెంటనే మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, డిసెంబరులో ప్రయోగం చేపట్టడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. 2018లోనే ఈ మిషన్‌ గురించి ప్రకటించినా.. కొన్ని కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ‘ఇప్పటి వరకు అంతా సవ్యంగానే సాగింది. లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎత్తేసిన తర్వాత తుది దశ ప్రయోగానికి ముందు శాస్ర్తవేత్తలంతా సమావేశమై పరిస్థితులను అంచనా వేయనున్నారు’ అని ఇస్రోవర్గాలు తెలిపాయి. 

‘గగన్‌యాన్ మిషన్‌’ అనేది మూడు దశల ప్రయోగం. మొదటి రెండు దశల్లో మానవ రహిత మాడ్యూళ్లను అంతరిక్షంలోకి పంపుతారు. అనంతరం, మూడో దశలో రష్యాలో శిక్షణ పొందిన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతారు. మొదటి దశ ప్రయోగాలను ఈ ఏడాది డిసెంబరులో, రెండో దశ ప్రయోగాలను 2022-23లో చేపట్టనున్నారు. ఆ రెండు ప్రయోగాలు విజయవంతమైతే చివరగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు.  కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ప్రయోగించాల్సిన పలు మిషన్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. సూర్యుడిపై పరిశోధనల కోసం ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్1’ మిషన్‌, మరో మూడు ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్స్‌, రెండు స్మాల్ శాటిలైట్‌ లాంఛ్‌ వెహికిల్స్‌ (ఎస్‌ఎస్‌ఎల్వీ) ప్రయోగాలు వాయిదా పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని