SputnikV: కొత్త వేరియంట్లపై మా టీకా భేష్‌..!

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కొత్తగా వెలుగు చూసిన అన్ని కరోనా రకాల వేరియంట్ల నుంచి స్పుత్నిక్‌ టీకా రక్షణ కల్పిస్తోందని టీకా అభివృద్ధి సంస్థ గమలేయా వెల్లడించింది.

Published : 22 Jun 2021 21:17 IST

గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ వెల్లడి

మాస్కో: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కొత్తగా వెలుగు చూసిన అన్ని కరోనా రకాల వేరియంట్ల నుంచి స్పుత్నిక్‌ టీకా రక్షణ కల్పిస్తోందని టీకా అభివృద్ధి సంస్థ గమలేయా వెల్లడించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అభివృద్ధి చెందే యాంటీబాడీలు అన్ని వేరియంట్లపైనా పనిచేస్తున్నాయని తెలిపింది. కొత్తరకం వేరియంట్లపై వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తున్నాయనే విషయంపై చర్చ నడుస్తోన్న నేపథ్యంలో స్పుత్నిక్‌ ఊరటనిచ్చే విషయాన్ని తెలిపింది. అయితే, భారత్‌లో వినియోగంలో ఉన్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు కూడా డెల్టా వేరియంట్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

‘స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత వృద్ధిచెందే యాంటీబాడీలు ఇప్పటివరకు వెలుగు చూసిన అన్ని వేరియంట్ల నుంచి రక్షణ కలిపిస్తున్నాయి. బ్రిటన్‌ రకం నుంచి భారత్‌లో వెలుగు చూసిన డెల్టా రకం వరకూ.. అన్ని వేరియంట్లపై స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తోంది’ అని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా డెల్టా రకంపై జరిపిన అధ్యయనంలో స్పుత్నిక్‌ వి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలిందని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన అధ్యయన నివేదికను విశ్లేషణ కోసం అంతర్జాతీయ జర్నల్‌లోనూ ప్రచురించామని తెలిపింది.

ఇతర సంస్థల కోసం ‘కాక్‌టెయిల్‌’ డోస్‌..

డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు ఇతర వ్యాక్సిన్‌ తయారీదారుల కోసం బూస్టర్‌ డోసులను కూడా సిద్ధం చేసినట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) వెల్లడించింది. దీన్ని కాక్‌టెయిల్‌ డోసుగా పేర్కొన్న ఆర్‌డీఐఎఫ్‌.. కొత్త వేరియంట్లను ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేస్తోందని తెలిపింది.

ఇదిలాఉంటే, ప్రస్తుతం భారత్‌లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌తోపాటు స్పుత్నిక్‌ వి కూడా వినియోగంలో ఉన్న విషయం తెలిసిందే. ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి 91.6శాతం సమర్థత కలిగివున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఇప్పటివరకు 67దేశాల్లో అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్‌ వి అనుమతి పొందినట్లు ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని