Updated : 22 Mar 2021 17:25 IST

జాతికోసం శ్రమించారు.. భారత్‌ మన్ననలు పొందారు!

2019, 2020కి గాంధీ శాంతి పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

దిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏటా ఇచ్చే శాంతి పురస్కారాలను భారత ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 2020, 2019 సంవత్సరాలకు కలిపి ఒకేసారి ఈ పురస్కారాలను వెల్లడించింది. 2020 ఏడాదికి గాను బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు దివంగత షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ను ఎంపిక చేయగా.. 2019కి ఒమన్‌ సుల్తాన్‌ దివంగత ఖబూస్‌ బిన్‌ సైద్‌ను ఎంపిక చేసింది. ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమైన జ్యూరీ.. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై చర్చించింది. అనంతరం బంగ బంధు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌, ఒమన్‌ సుల్తాన్‌ హెచ్‌.ఎం. ఖబూస్‌ బిన్‌ సైద్‌లను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. వీరిద్దరూ గొప్ప దూరదృష్టికలిగిన నాయకులుగా కేంద్రం పేర్కొంది. ముజిబుర్‌ రెహ్మాన్, ఖబూస్‌.. ఇద్దరూ గాంధీజీ చూపిన అహింసాయుత మార్గంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన విశేషకృషికి గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ను మానవ హక్కులు, స్వేచ్ఛా విజేతగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన భారతీయులకూ ఓ హీరో అన్నారు. ఆయన ఇచ్చిన వారసత్వం, ప్రేరణ ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు. అలాగే, 2019కి గాంధీ శాంతి పురస్కారానికి ఎంపికైన ఖబూస్.. ‌అంతర్జాతీయ సమస్యలు తలెత్తినప్పుడు మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకొని, శాంతియుతమార్గంలో పరిష్కారానికి కృషిచేసి ప్రపంచ మన్ననలు పొందారు. పలు ప్రాంతాల్లో వివాదాలు, సంఘర్షణలు తలెత్తినప్పుడు శాంతియుత ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. భారత్‌- ఒమన్‌ మధ్య  ప్రత్యేక సంబంధాల నిర్మాణంలో ఆయనదే కీలక పాత్ర. భారత్‌లో విద్యాభ్యాసం చేసిన ఖుబూస్‌.. మన దేశంతో ప్రత్యేక సంబంధాలు కొనసాగించారు. ఆయన నాయకత్వంలో భారత్‌, ఒమన్‌ వ్యూహాత్మక భాగస్వాములుగా మారాయి.

మహాత్మా గాంధీ 125వ జయంత్యుత్సవాల సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని 1995లో ఏర్పాటు చేశారు. దేశం, జాతి, భాష, కులం, మతం, లింగ భేదం.. ఇలా ఎలాంటి అవధులు లేకుండా గాంధీజీ బాటలో శాంతియుత మార్గంలో నవ ప్రపంచ నిర్మాణానికి కృషిచేసిన గొప్ప వ్యక్తులకు ఏటా ఈ ప్రైజ్‌ను అందజేస్తుంటారు. ఈ పురస్కారం ఎంపిక కోసం ఏర్పాటైన జ్యూరీలో దేశ ప్రధాని, ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు, వీరితో పాటు మరోఇద్దరు ప్రముఖులు ఉంటారు. ప్రస్తుత జ్యూరీలో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, సులభ్ ఇంటర్నేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ ఉన్నారు. ఈ పురస్కారం కింద రూ.కోటి నగదుతో పాటు జ్ఞాపికను అందజేస్తారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని