Ganga Vilas: గంగా విలాస్‌ నౌకలో ‘బార్‌’..! అఖిలేశ్‌ ఆరోపణ

ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ (Ganga Vilas)పై ఆరోపణలు మొదలయ్యాయి. ఇది ఎన్నటి నుంచో నడుస్తోందని.. కొత్తగా ‘బార్‌’ను మాత్రమే అందుబాటులో ఉంచారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) మండిపడ్డారు.

Published : 16 Jan 2023 01:47 IST

రాయ్‌బరేలీ: ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ (Ganga Vilas)ను ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, దీన్ని కొత్తగా ప్రారంభించామని భాజపా ప్రకటించుకోవడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఆ నౌక సేవలు అందిస్తోందని.. ప్రస్తుతం అందులో మద్యం అందుబాటులో ఉండే బార్‌ (Bar) మాత్రమే కొత్తగా తెచ్చారని ఆరోపించారు. పాతవాటిని మళ్లీ ప్రారంభించే సంప్రదాయం భాజపాకు ఉందన్న అఖిలేశ్‌.. అందులో బార్‌ ఉందో? లేదో? అనే విషయంపై భాజపానే స్పష్టత ఇవ్వగలదని పేర్కొన్నారు.

అఖిలేశ్‌ యాదవ్‌ రాయ్‌బరేలీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ నదీ పర్యాటక నౌక ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది. కొత్తదేం కాదు. గత 17ఏళ్లుగా నడుస్తోందని నాకు కొందరు చెప్పారు. కేవలం కొన్ని మార్పులు చేసి మేం ప్రారంభించాం అని వాళ్లు (భాజపా) ప్రకటించుకుంటున్నారు. ప్రచారం చేసుకోవడం, అబద్ధాలు చెప్పడంలో భాజపా వాళ్లు ఎంతో ముందుంటారు. పవిత్రమైన గంగా నదీలో ప్రయాణించే ఆ నౌకలో మద్యం అందించే బార్లు కూడా ఉన్నట్లు నేను విన్నాను. ఇప్పటివరకు గంగాలో హారతి మాత్రమే ఇస్తారని మనం వినేవాళ్లం. మరి ఇప్పుడు ఆ నౌకలో బార్‌ ఉందో లేదో భాజపా వాళ్లే చెప్పాలి’ అని అన్నారు.

ఇదిలా ఉంటే, 51 రోజుల పాటు కొనసాగే ‘గంగా విలాస్‌’ ప్రయాణంలో ఒక్కొక్కరికి రూ.50 లక్షల నుంచి రూ.55లక్షల వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. వారణాసిలోని గంగా హారతితో మొదలై బిహార్‌లోని విక్రమశిల యూనివర్సిటీ, పశ్చిమబెంగాల్‌లోని సుందర్బన్‌ డెల్టా, అస్సాంలోని కజిరంగా నేషనల్‌ పార్కు సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను చూడొచ్చు. అయితే, 36 మంది పర్యాటకులు ప్రయాణించే వీలున్న ఈ నౌకా ప్రయాణానికి 2024 ఏప్రిల్‌ వరకు బుకింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో ఎక్కువగా అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని