Punjab: పంజాబ్‌ గ్యాంగ్‌వార్‌..!

పంజాబ్‌ సింగర్‌, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాల హత్య దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. భారత్‌లో వినియోగించని ఓ అత్యాధునిక ఆయుధాన్ని ఈ హ్యతకు వాడటం ఆందోళన కరంగా మారింది. పంజాబ్‌లో పాతుకుపోయిన గన్‌కల్చర్‌..

Updated : 02 Jun 2022 17:28 IST

 గన్‌కల్చర్‌ను పెంచి పోషించిన ఫలితమిది

ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం: పంజాబ్‌ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. భారత్‌లో వినియోగించని ఓ అత్యాధునిక ఆయుధాన్ని ఈ హ్యతకు వాడటం ఆందోళనకరంగా మారింది. పంజాబ్‌లో పాతుకుపోయిన గన్‌ కల్చర్‌.. రాజకీయాలు.. అక్కడ గ్యాంగ్‌స్టర్లను పెంచి పోషిస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్లను అంతమొందించేందుకు చర్యలు చేపట్టామని ప్రభుత్వం ప్రకటించిన కొన్ని రోజుల్లోనే మూసేవాలా హత్య జరిగి పాలకులకు సవాల్‌ విసిరినట్లయింది.

పంజాబ్‌లో భగవంత్‌మాన్‌ సర్కారు అధికారంలోకి రాగానే యాంటీ గ్యాంగ్‌స్టర్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 గ్యాంగ్‌లకు చెందిన 300 నుంచి 500 గ్యాంగ్‌స్టర్లను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. కానీ, చాలా గ్రూపులు రాష్ట్రంలో చురుగ్గా పనిచేస్తున్నాయి. వీటిల్లో చాలా వరకు పక్కరాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో విస్తరించినవి ఉన్నాయి. వీరు వసూళ్లు, హత్యలతోపాటు.. తమ గ్యాంగ్‌ వార్‌కు పంజాబ్‌ సహా కెనడా వంటి దేశాలను వేదికగా చేసుకొంటున్నారు. పరస్పరం బెదిరింపులకు సామాజిక మాధ్యమాలను వాడుకోవడం ఇక్కడ ఫ్యాషన్‌గా మారింది. 

1990ల్లో బిందీ జోహల్‌ - రోన్‌ దోసాంజ్‌ వర్గాలు ఇదే తరహాలో తలపడ్డాయి. 1994లో కెనడాలోని వాంకోవార్‌లో తన సోదరుడు జిమ్మీ దోసాంజ్‌ హత్యకు ప్రతీకారంగా బిందీ జోహాల్‌ను చంపుతానని రోన్‌ దోసాంజ్‌ ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత రెండు వారాలకే రోన్‌ను ప్రత్యర్థులు పట్టపగలే కాల్చి చంపడం సంచలనం సృష్టించింది. 

విశ్వవిద్యాలయాల్లో వ్యాపించి.. రాజకీయాల్లోకి పాకి..

పంజాబ్‌లో యువతలో గ్యాంగ్‌స్టర్‌ కల్చర్‌ 1980ల్లోనే వ్యాపించింది. అప్పట్లో పంజాబ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకుడు మాఖన్‌ సింగ్‌ ఇక్కడ ఇతర గ్యాంగ్‌స్టర్లకు స్ఫూర్తిగా మారాడు. మాఖన్‌ను విద్యార్థుల మధ్యలోనే ప్రత్యర్థులైన చీమా గ్యాంగ్‌ కాల్చి చంపింది. ఆ తర్వాత చాలా మంది గ్యాంగ్‌ సభ్యులు బయటకొచ్చారు. వివాదాల్లో తలదూర్చి పంచాయతీలు చేసి రాబిన్‌హుడ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నారు. ఫజ్లికా ప్రాంతానికి చెందిన జస్వీందర్‌ సింగ్ (రాఖీ) వంటి వారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటికే అతనిపై హత్య, వసూళ్లు, కిడ్నాప్‌లు, కుట్ర, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి 30కేసులు ఉన్నాయి. వీటిల్లో 18 నిర్ధారణ అయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న సమయంలో అతడిని ప్రత్యర్థులు సిమ్లా హైవేపై కాల్చి చంపారు. ప్రజల కోసం తమ జీవితాలను రిస్క్‌ చేస్తున్న వారిలా  ఇమేజ్‌ను వీరు సృష్టించుకొని గ్రామీణులను ఆకర్షిస్తున్నారని పంజాబ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్న సరబ్‌జీత్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రబ్జిందర్‌ సింగ్‌ బ్రార్‌ అలియాస్‌ డింపీ అనే కాంట్రాక్టు కిల్లర్‌ అక్కడి రాజకీయ నాయకులకు సన్నిహితుడు.

ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, బిహార్‌, కర్ణాటక, దిల్లీల్లో పలు నేరాలకు పాల్పడ్డాడు. 2006లో అతను జైలు నుంచి బెయిల్‌పై బయటకు వస్తే 25,000 మంది ప్రజలు, 500 కార్ల కాన్వాయ్‌ అతడికి స్వాగతం పలికేందుకు రావడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. అదే ఏడాది డింపీని ప్రత్యర్థులు కాల్చి చంపారు. విక్కీ గౌండర్‌ కూడా ఇక్కడ 2010-15 మధ్యలో టాప్‌ గ్యాంగ్‌స్టర్‌గా పంజాబ్‌ను ఏలాడు. తాజాగా మూసేవాలా హత్యలో కీలక నిందితుడు లారెన్స్‌ బిష్ణోయ్‌ కూడా జాతీయ స్థాయి అథ్లెట్‌, పంజాబ్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా చేశాడు. కానిస్టేబుల్‌ కుమారుడైన లారెన్స్‌ 2009లో పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి లా పూర్తి చేశాడు. ఆ తర్వాత విద్యార్థి రాజకీయాల్లో గోల్డీ బ్రార్‌తో పరిచయం అయింది. కొన్నాళ్లకు మెల్లగా అసాంఘిక కార్యకలపాలు మొదలుపెట్టాడు. 2018లో తన అనుచరుడు సంపత్‌ నెహ్రాతో కలిసి సినీ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హత్యకు కుట్రపన్నడంతో జాతీయ స్థాయి వార్తలకెక్కాడు. ప్రస్తుతం బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో ప్రొఫెషనల్‌ షూటర్లు ఉన్నారు. వీరి నెట్‌వర్క్‌ పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో విస్తరించింది. ఇతడి అనుచరుడే గోల్డీబ్రార్‌. లారెన్స్‌ను చంపేందుకు ఇప్పటికీ దిల్లీలోని గ్యాంగ్‌స్టర్లు కాచుకు కూర్చోవడంతో.. లారెన్స్‌ను వివిధ కేసుల్లో కోర్టు తరలించడం కూడా పోలీసులకు కత్తిమీద సాముగా మారింది. 

విచ్చలవిడిగా తుపాకులు..

దేశం మొత్తంలో యూపీ, కశ్మీర్‌ తర్వాత అత్యధిక తుపాకీ లైసెన్స్‌లు పంజాబ్‌లోనే జారీ అయ్యాయి. ఇక్కడ లైసెన్స్‌ల జారీ విధానంలో పరోక్షంగా రాజకీయ జోక్యం ఉండటం కూడా ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా జనవరి నాటికి 35లక్షల తుపాకులకు లైసెన్స్‌లు ఉంటే.. పంజాబ్‌లో 3.6లక్షల లైసెన్స్‌లు జారీ చేశారు. ఒక లైసెన్స్‌పై మూడు ఆయుధాలను ఉంచుకోవచ్చు. గత 20 ఏళ్లలోనే అత్యధికంగా లైసెన్స్‌లు జారీ అయ్యాయి. ఇక ఫిరోజ్‌పూర్‌ వంటి జిల్లాల్లో విచ్చలవిడిగా లైసెన్స్‌లు ఇచ్చారు. ఈ ఒక్క జిల్లాలో 2021 నాటికి 21,221 తుపాకీ లైసెన్స్‌లు ఉన్నాయి. జిరా సబ్‌డివిజన్‌లో ఏకంగా 3,708 లైసెన్స్‌లు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముక్తసర్‌, సంగ్రూర్‌, హోషియార్‌పూర్‌, టార్న్‌టరాన్‌, అమృత్‌సర్‌ జిల్లాలోనే ఎక్కువగా లైసెన్స్‌లు జారీ అయ్యాయి. ఈ రాష్ట్రం మొత్తంలో 11 లక్షల వరకు తుపాకులు ఉండొచ్చని అంచనా. 

గన్‌ గ్లామర్‌..

పంజాబ్‌ సినిమాలు, ప్రైవేటు ఆల్బమ్‌ల్లో తుపాకులను ఆకర్షణీయంగా చూపించడం కూడా యువతను ఆ వైపు నడిపిస్తోంది. ఇటీవల మృతి చెందిన మూసేవాలా పాటల్లోనూ ఈ శైలి కనిపిస్తుంది. గన్‌కల్చర్‌ను ప్రచారం చేస్తున్నారని చండీగఢ్‌లోని ఓ లాయర్‌ ఫిర్యాదు కూడా చేశారు. అదే ఏడాది అతడు ఏకే-47 రైఫిల్‌ శిక్షణ తీసుకొంటున్న వీడియో బయటకు రావడం కూడా వివాదాస్పదమైంది. గతంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పంజాబ్‌లో గన్‌కల్చర్‌, డ్రగ్స్‌ ,హింసను ప్రచారం చేసే వీడియోలను అడ్డుకొనేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. తాజాగా కొత్త ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ కూడా ఈ దిశగా చర్యలు చేపట్టారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని