Salman Khan: సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు.. గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్ పనేనా?

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపుల లేఖ.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లేఖ గురించి తిహాడ్‌ జైలులో ఉన్న బిష్ణోయ్‌ను దిల్లీ పోలీసులు

Published : 06 Jun 2022 17:33 IST

దిల్లీ: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపుల లేఖ.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లేఖ గురించి తిహాడ్‌ జైలులో ఉన్న బిష్ణోయ్‌ను దిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

సల్మాన్‌, ఆయన తండ్రిని బెదిరిస్తూ నిన్న ఆయన నివాసానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఓ లేఖ వచ్చిన విషయం తెలిసిందే. రోజూ జాగింగ్‌ అయ్యాక సల్మాన్‌ కూర్చునే  బెంచిపై ఈ లేఖ లభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.  ‘‘త్వరలో సిద్ధూ మూసేవాలా లాంటి పరిస్థితే మీకు ఎదురవుతుంది’’ అంటూ దుండగులు ఆ లేఖలో బెదిరించారు. లేఖపై జి.బి, ఎల్‌.బి అనే అక్షరాలు ఉన్నాయి. దీంతో ఆ అక్షరాలను గోల్డీ బ్రార్‌, లారెన్స్‌ బిష్ణోయ్‌ పేర్లకు షార్ట్‌కట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ లేఖను బిష్ణోయ్‌ ముఠానే పంపించిందా లేదా ఎవరైనా అతడి పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇందులో భాగంగానే జైల్లో ఉన్న బిష్ణోయ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన విషయం తెలిసిందే. ఇది తమ పనే అని బిష్ణోయ్‌ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు.

మరోవైపు, బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌ నివాసం వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ఆయన ఇంటి వెలుపల ఉన్న సీసీటీవీ దృశ్యాలను సేకరిస్తున్నారు. గతంలో సల్మాన్‌పై దాడి చేసేందుకు బిష్ణోయ్ ముఠా కుట్రలు పన్నింది. 2011లో రెడీ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనపై దాడికి విఫలయత్నం చేసింది. సల్మాన్‌ ఇంటి ముందు కొందరు రెక్కీ కూడా నిర్వహించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే దిల్లీ పోలీసులు బిష్ణో్య్‌ ముఠాకు చెందిన ముగ్గరు షార్ప్‌ షూటర్లను అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని