Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీకి యావజ్జీవ కారాగార శిక్ష

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీని 32 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో వారణాసి కోర్టు దోషిగా తేల్చింది. అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Published : 05 Jun 2023 15:19 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో 32 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీని వారణాసి కోర్టు దోషిగా తేల్చింది. అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా రూ.1 లక్ష జరిమానా విధించింది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీ 1991లో ఓ కాంగ్రెస్‌ లీడర్‌ని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు. అప్పుడప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న అన్సారీ.. 1991, ఆగస్టు 3న మాజీ ఎమ్మెల్యే అజయ్‌ రాయ్‌ సోదరుడు అవదేశ్‌ రాయ్‌ను అతడి ఇంటి ముందే కాల్చి చంపాడు. ఈ కేసులో అన్సారీతోపాటు భీమ్‌ ససింగ్‌, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్‌, మరో ఇద్దర్ని నిందితులుగా చేర్చారు.  దీనిపై మే 19న తుది విచారణ చేపట్టిన వారణాసి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. తీర్పు నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరో హత్య కేసులో అన్సారీ ప్రస్తుతం 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

కాంగ్రస్‌ నేత హత్య తర్వాత కేసు దర్యాప్తును అక్కడి ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. కేసు విచారణ దశలో ఉండగా.. జూన్‌ 2022లో కేసుకు సంబంధించిన డైరీ మాయమవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో డైరీ జిరాక్స్‌ల సాయంతో విచారణ కొనసాగించారు. జిరాక్స్‌ పేపర్ల ఆధారంగా ఓ కేసులో తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. ముఖ్తార్‌ అన్సారీ 1996, 2002,2007, 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. చివరి మూడు విజయాలు అతడు జైల్లో ఉండగా సాధించినవే.  61 క్రిమినల్‌ కేసుల్లో అన్సారీ నిందితుడు. తాజా శిక్ష అతడికి ఐదోది. మరో 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. భాజపా ఎమ్మెల్యే కృష్ణేందురాయ్‌ హత్య కేసులో కూడా అన్సారీ నిందితుడు కావడం గమనార్హం.  అన్సారీ తాత డా.ముఖ్తార్‌ అహ్మద్‌ అన్సారీ స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్‌కు జాతీయ అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని