Anand Mohan: రూల్స్‌ మార్చి మరీ గ్యాంగ్‌స్టర్‌ విడుదల.. ఎవరీ ఆనంద్‌ మోహన్‌..?

ఓ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్‌ (Anand Mohan) సహా 27 మంది దోషుల విడుదలకు బిహార్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి ముందు జైలు నిబంధనలను మార్చేశారు. ఇంతకీ ఎవరీ ఆనంద్‌ మోహన్‌..?

Updated : 25 Apr 2023 19:18 IST

(పాత చిత్రం)

పట్నా: బిహార్‌ (Bihar) ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల నీతీశ్‌ సర్కారు జైలు మాన్యువల్‌ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలోనే 27 మంది ఖైదీల విడుదలకు తాజాగా ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్‌ సింగ్‌ (Anand Mohan Singh) కూడా ఒకరు. 30 ఏళ్ల క్రితం ఓ ఐఏఎస్‌ అధికారి హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ.. తాజాగా జైలు నిబంధనల సవరణతో విడుదలయ్యాడు. దీంతో ఆ గ్యాంగ్‌స్టర్‌ కోసమే నీతీశ్‌ రూల్స్‌ మార్చేశారంటూ విపక్షాలు భగ్గుమన్నాయి.

వివాదం మొదలైందిలా..

బిహార్‌ జైలు మాన్యువల్‌-2012ను నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) ప్రభుత్వం ఏప్రిల్ 10న సవరించింది. ఇందులో రెమిషన్‌ మంజూరు చేయకూడని దోషుల జాబితాలో ‘‘విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల హత్య కేసుల’’ క్లాజ్‌ను తొలగించింది. అంటే.. ఇకపై ఇలాంటి కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న దోషులకు శిక్షాకాలాన్ని తగ్గించి రెమిషన్‌ మంజూరు చేసే వీలు కల్పించింది. ఈ నిర్ణయం తీవ్ర దుమారానికి దారితీసింది. నీతీశ్ సర్కారు రూల్స్‌ మార్చడంతో.. గత 15 ఏళ్లుగా జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్ (Anand Mohan) విడుదలకు మార్గం సుగమమవుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.

అనుకున్నట్లుగానే యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 27 మంది ఖైదీల విడుదలకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏప్రిల్‌ 20న జరిగిన రెమిషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు దానిలో పేర్కొన్నారు. విడుదల కానున్న ఖైదీల్లో ఆనంద్‌ మోహన్‌ పేరు కూడా ఉండటం తీవ్ర వివాదానికి తెరలేపింది.

ఏంటీ ఆనంద్ మోహన్‌ కేసు..

1994లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్యాంగ్‌స్టర్‌, బిహార్‌ పీపుల్స్‌ పార్టీ (బీపీపీ) నాయకుడు ఛోటన్‌ శుక్లాను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. బీపీపీ వ్యవస్థాపకుడు ఆనంద్‌ మోహన్‌ (Anand Mohan) పిలుపుతో వేలాది మంది ఆ పార్టీ కార్యకర్తలు ఛోటన్‌ అంతిమయాత్ర సమయంలో దాడులు జరిపారు. ఈ క్రమంలోనే నాటి గోపాల్‌గంజ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న 35 ఏళ్ల ఐఏఎస్‌ అధికారి జి.కృష్ణయ్యను కారు నుంచి బయటకు లాగి రాళ్లతో తీవ్రంగా కొట్టారు. ఈ మూకదాడిలో కృష్ణయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కృష్ణయ్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తే. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్‌.

ఆందోళనకారులను రెచ్చగొట్టి కృష్ణయ్య హత్యకు కారణమయ్యాడన్న ఆరోపణలపై ఆనంద్‌ మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, జైల్లో ఉండగానే 1996లో బిహార్‌లోని సియోహర్‌ లోక్‌సభ స్థానం నుంచి అతడు ఎంపీగా గెలిచాడు. అనంతరం ఈ కేసులో ఆనంద్‌ మోహన్‌ను దోషిగా తేల్చిన బిహార్‌ దిగువ కోర్టు.. 2007లో అతడికి మరణశిక్ష విధించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరణశిక్ష పడిన తొలి రాజకీయ నాయకుడు ఇతడే. ఈ తీర్పుపై విచారణ చేపట్టిన పట్నా హైకోర్టు 2008లో ఈ శిక్షను జీవితఖైదుగా మార్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.

రాజకీయ నేతలతో బలమైన సంబంధాలు..

కాగా.. ఆనంద్‌ మోహన్‌కు బిహార్‌ రాజకీయ నేతలతో బలమైన సంబంధాలున్నాయి. యావజ్జీవ శిక్షతో అతడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయినప్పటికీ జైలు నుంచే అతడు చక్రం తిప్పుతున్నాడని స్థానికంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడు తన కుమారుడు, ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్‌ ఆనంద్‌ నిశ్చితార్థం కోసం 15 రోజుల పెరోల్‌పై ఇటీవలే బయటికొచ్చాడు. మంగళవారం చేతన్‌ ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ (Nitish Kumar), ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) సహా పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. ఈ సమయంలో అతడి విడుదలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని