Pulwama encounter: శరీరంలో తూటాలు దిగినా.. ఉగ్రవాదులను వదల్లేదు..!

ఓ పక్క ఉగ్రవాదలు కాల్చిన తూటాలు శరీరంలో దిగబడినా లెక్క చేయకుండా ఎదురు దాడి చేశాడో గరడ్‌ కమాండో. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. ఈ ఘటన శనివారం పుల్వామా

Published : 01 Feb 2022 01:21 IST

 పుల్వామా ఎన్‌కౌంటర్‌లో గరుడ్‌ కమాండో వీరోచిత పోరాటం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ పక్క ఉగ్రవాదులు కాల్చిన తూటాలు శరీరంలో దిగినా.. లెక్క చేయకుండా ఎదురు దాడి చేశాడో గరుడ్‌ కమాండో. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. ఈ ఘటన శనివారం పుల్వామా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చోటుచేసుకొంది. పుల్వామాలోని నైరా గ్రామం వద్ద ఉగ్రవాదులు నక్కినట్లు శనివారం భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. దీంతో 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్ము కశ్మీర్‌ పోలీసులు, గరుడ్‌ కమాండోలు కలిసి తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ఉగ్రవాదులు ఉన్న ఇంటిని గుర్తించారు. వెంటనే  స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించి.. దళాలు ఉగ్రస్థావరాన్ని చుట్టుముట్టాయి. ఈ విషయం గ్రహించిన ఉగ్రవాదులు భద్రతా దళాల ఉచ్చు నుంచి తప్పించుకోవడం కోసం ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టారు. ముష్కరులు నేరుగా సైన్యం, గరుడ్‌ కమాండోలపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో స్క్వాడ్రన్‌ లీడర్‌ సందీప్‌ ఝాజరియా శరీరంలోకి రెండు తూటాలు చొచ్చుకుపోయాయి. ఒకటి ఛాతి సమీపంలో, మరొకటి ఎడమ చేతిపై దిగాయి. అయినా.. వెనక్కి తగ్గలేదు. ఉగ్రవాదులతో పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత అక్కడే నక్కి ఉన్న మరో ఉగ్రవాది కాల్పులు జరపడంతో కార్పొరల్‌ ఆనంద్‌ గాయపడ్డాడు. దీంతో అప్రమత్తమైన దళాలు ఆ ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టాయి.

వాయుసేనకు చెందిన గరుడ్‌ దళానికి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్స్‌లో అనుభవం గడించేందుకు కశ్మీర్‌లోని రాష్ట్రీయ్‌ రైఫిల్స్‌కు అటాచ్‌ చేశారు. 2017లో హజిన్‌ వద్ద జరిగిన ఆపరేషన్స్‌లో గరుడ్‌ కమాండోలు అనితర ధైర్యసాహసాలు చూపారు. ఈ ఆపరేషన్‌కుగాను కార్పొరల్‌ జేపీ నిరాలకు మరణానంతరం అశోక చక్ర వచ్చింది. ఇక వింగ్‌ కమాండర్‌ రాజీవ్‌ చౌహాన్‌కు వాయుసేన గ్యాలంటరీ అవార్డు దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని