CDS: నూతన త్రివిధ దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన జనరల్‌ అనిల్‌ చౌహాన్‌

భారత నూతన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS)గా జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ (61) బాధ్యతలు స్వీకరించారు.

Published : 30 Sep 2022 15:26 IST

దిల్లీ: భారత నూతన చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS)గా జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ (61) బాధ్యతలు స్వీకరించారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది నెలల తర్వాత దేశ అత్యున్నత సైనిక కమాండర్‌గా ఈయన బాధ్యతలు చేపట్టారు. దేశ రెండో సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జనరల్‌ చౌహాన్‌.. భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ కొనసాగుతారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.

‘భారత సాయుధ బలగాల్లో అత్యున్నత పదవీ బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వంగా ఉంది. త్రివిధ దళాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నించడంతోపాటు అన్నిరకాల ఇబ్బందులు, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాను’ అని బాధ్యతలు చేపట్టిన అనంతరం జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ అన్నారు. ఈ సందర్భంగా రైసినా హిల్స్‌ వద్ద ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, వాయుసేనాధిపతి చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి, నేవీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎస్‌ఎన్‌ ఘోర్‌మేడ్ సమక్షంలో త్రివిధ దళాల నుంచి సీడీఎస్‌ గౌరవ వందనం స్వీకరించారు.

లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ ఈస్టర్న్‌ కమాండ్‌ చీఫ్‌గా 2021 మే నెలలో పదవీ విరమణ చేశారు. దాదాపు 40ఏళ్ల కెరీర్‌లో అనిల్ చౌహాన్ సైన్యంలోని అనేక హోదాల్లో పనిచేశారు. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు కార్యకలాపాలను నిరోధించడంలో ఆయనకు విస్తృతమైన అనుభవం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని