General Manoj Pande: సైన్యానికి కొత్త బాస్‌.. ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్‌ మనోజ్‌ పాండే

భారత 29వ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా జనరల్‌ మనోజ్‌ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఈ హోదాలో ఉన్న జనరల్ ఎంఎం నరవణె సర్వీసు నుంచి రిటైర్‌ కావడంతో.. ఆయన స్థానంలో మనోజ్‌ పాండే నియమితులయ్యారు...

Published : 30 Apr 2022 15:58 IST

దిల్లీ: భారత 29వ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా జనరల్‌ మనోజ్‌ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఈ హోదాలో ఉన్న జనరల్ ఎంఎం నరవణె సర్వీసు నుంచి రిటైర్‌ కావడంతో.. ఆయన స్థానంలో మనోజ్‌ పాండే నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేసిన జనరల్ పాండే.. ‘కోర్‌ ఆఫ్ ఇంజినీర్స్’ నుంచి సైన్యానికి నాయకత్వం వహిస్తున్న మొదటి అధికారిగా నిలిచారు. ఫిబ్రవరి 1న ఆర్మీ వైస్ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణకు ముందు ఆయన.. సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ సెక్టార్‌లలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి రక్షణ బాధ్యతలు పర్యవేక్షించే ‘తూర్పు ఆర్మీ కమాండ్‌’కు నాయకత్వం వహించారు. పాక్‌, చైనాలతో సరిహద్దు వివాదాలతోపాటు దేశం అనేక భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో జనరల్ పాండే సైన్యానికి బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ చీఫ్‌గా ఆయన.. ప్రభుత్వ థియేటర్ కమాండ్‌ ప్రణాళికలో భాగంగా నావికా, వాయుసేనలతోనూ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) పూర్వ విద్యార్థి అయిన జనరల్‌ పాండే.. డిసెంబర్ 1982లో కోర్‌ ఆఫ్ ఇంజినీర్స్(ది బాంబే సాపర్స్)లో నియమితులయ్యారు. భిన్న పరిస్థితుల్లో సైనిక ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిన అధికారిగా ఆయనకు పేరుంది. జమ్మూ- కశ్మీర్‌లో ‘ఆపరేషన్ పరాక్రమ్’ సమయంలో నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఇంజినీర్ రెజిమెంట్, పశ్చిమ సెక్టార్‌లో ఇంజినీర్ దళం, ఎల్‌ఓసీ వెంబడి ఇన్‌ఫ్యాంట్రీ దళం, పశ్చిమ లద్ధాఖ్‌లోని ఎత్తయిన ప్రాంతంలో మౌంటెన్‌ డివిజన్‌కు, ఈశాన్య ప్రాంతంలో ఓ కోర్‌కు నాయకత్వం వహించారు. అండమాన్ నికోబార్ కమాండ్‌కు కమాండర్-ఇన్-చీఫ్‌(సీఐఎన్‌సీఏన్‌)గా కూడా పనిచేశారు. ఇది భారత్‌కు చెందిన ఏకైక ట్రై-సర్వీసెస్ కమాండ్. దీంతోపాటు ఈశాన్య ప్రాంతంలోని మౌంటెన్ బ్రిగేడ్‌కు బ్రిగేడ్ మేజర్‌గా, మిలిటరీ సెక్రెటరీ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మిలిటరీ సెక్రెటరీ(ఏఎంఎస్‌)గా, ఈశాన్య కమాండ్ ప్రధాన కార్యాలయంలో బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ (ఆపరేషన్స్)గా విధులు నిర్వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని