ట్రంప్‌ ఆదేశాలతోనే...

బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడి తామే చేసినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ ధ్రువీకరించింది. ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్‌ను చంపాలన్న..........

Updated : 06 Jan 2020 07:43 IST

బాగ్దాద్‌ విమానాశ్రయంపై దాడి తమ పనేనని ధ్రువీకరించిన అమెరికా

వాషింగ్టన్‌: బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడి తామే చేసినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ ధ్రువీకరించింది. ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్‌ను చంపాలన్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకే ఈ దాడి జరిపినట్లు వెల్లడించింది. జనరల్‌ సోలెమన్‌ మృతిని ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కూడా ధ్రువీకరించింది. అమెరికా వైమానిక దళాలలకు చెందిన హెలికాప్టర్లే దాడి చేశాయని ఆరోపించింది. దాడి జరిగిన కొద్దిసేపటికే ట్రంప్‌ అమెరికా జాతీయ జెండాను ట్విటర్‌లో ఉంచడం గమనార్హం. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు దాదాపు నాలుగు శాతం మేర పెరిగాయి.

ట్రంప్‌ ఏమని ఆదేశించారు...

ఇరాక్‌లో ఉన్న తమ బలగాల్ని రక్షించుకునేందుకు ఖాసీంని చంపాలని ట్రంప్ ఆదేశించినట్లు పెంటగాన్‌ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకే అమెరికా సైనిక వర్గాలు స్వీయ రక్షణలో భాగంగా దాడి చేయాల్సి వచ్చిందని తెలిపింది. భవిష్యత్తులో ఇరాన్‌ చేయాలనుకుంటున్న మరిన్ని దాడుల్ని నిరోధించాలనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరుల్ని రక్షించుకోవడానికి ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని పేర్కొంది. తాజా దాడిలో ఇరాక్‌ తిరుగుబాటు సంస్థ పీఎంఎఫ్‌ డిప్యూటీ కమాండర్‌ అబు మహదీ అల్‌-ముహందిస్ సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్‌నకు చెందిన మరికొంతమందిని అమెరికా బలగాలు బాగ్దాద్‌లో బంధించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

ఇటీవల ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్‌ మద్దతున్న నిరసనకారులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడున్న అమెరికా బలగాలతో తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. దీనిపై స్పందించిన అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌ ఎస్పర్‌.. అమెరికావాసులపై జరిపే దాడిని ఏమాత్రం సహించేది లేదన్నారు. దాడికి ఇరానే కారణమని ఆరోపించారు. తప్పకుండా ప్రతీకార చర్య ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఇరాన్‌ తమ చర్యల్ని నిలిపివేయాలని హితవు పలికారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజా దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

ఎవరీ ఖాసీం సోలెమన్‌...

ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌లో కీలక నిఘా విభాగం అయిన ఖుద్స్‌ ఫోర్స్‌కి మేజర్‌ జనరల్‌ ఖాసీం సోలెమన్‌ 1998 నుంచి అధిపతిగా ఉన్నారు. సరిహద్దు వెలుపల జరిపే దాడులు ఈ గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌పై పోరులో ఖాసీం కీలక పాత్ర పోషించినట్లు చెబుతుంటారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమనెయ్‌కి ఖాసీం నేరుగా రిపోర్ట్‌ చేస్తారు. 1980లో జరిగిన ఇరాక్‌-ఇరాన్‌ యుద్ధంలో తొలిసారి ఖాసీం వెలుగులోకి వచ్చారు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు